ఆఫ్రికన్ దేశమైన నైజర్‌లోని భారతీయ పౌరులను వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అక్కడి పరిస్థితులను వివరిస్తూ వీలైనంత త్వరగా నైజర్ వదిలి వెళ్లాలని భారత ప్రభుత్వం ఆగస్టు 11న భారతీయ పౌరులందరికీ సూచించింది. ఇది కాకుండా పరిస్థితి సాధారణమయ్యే వరకు తమ ప్రయాణ ప్రణాళికలను పునరాలోచించుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతీయులకు సూచించింది. మీడియాను ఉద్దేశించి విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. నైజర్‌లో జరుగుతున్న పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వీలైనంత త్వరగా భారతీయ పౌరులు దేశం విడిచి వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం గగనతలం మూసివేయబడిందని, భూసరిహద్దు గుండా బయలుదేరేటప్పుడు భద్రతను నిర్ధారించుకుని చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో నైజర్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకునే వారు కూడా పరిస్థితి సాధారణమయ్యే వరకు తమ ప్రయాణ ప్రణాళికలను పునఃపరిశీలించుకోవాలని సూచించారు.
వివరాల ప్రకారం.. నైజర్‌లో ధ్వంసమైన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి దళాలను మోహరించాలని ఆదేశించిన తర్వాత.. నైజర్ కొత్త మిలిటరీ పాలన, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతీయ కూటమి మధ్య ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. బహిష్కరించబడిన ప్రెసిడెంట్ మహమ్మద్ బజౌమ్‌ను తిరిగి నియమించడానికి ఆదివారం గడువు ముగియడంతో నైజర్‌లో రాజ్యాంగ క్రమాన్ని పునరుద్ధరించడానికి సాయుధ దళాలను ఆదేశించినట్లు తెలిసింది. ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించడానికి పొరుగు దేశాలు ఏదైనా సైనిక జోక్యానికి ప్రయత్నించినట్లయితే, బజౌమ్‌ను చంపేస్తామని నైజర్ జుంటా అమెరికా దౌత్యవేత్తతో చెప్పినట్లు ఇద్దరు పాశ్చాత్య అధికారులు తెలిపినట్లు సమాచారం. పశ్చిమ ఆఫ్రికా ప్రాంతీయ కూటమిలో 15 సభ్య దేశాలు నైజర్ ప్రభుత్వానికి సహకరిస్తాయో ప్రస్తుతం అస్పష్టంగా ఉన్నప్పటికీ.. నైజీరియా, బెనిన్‌తో పాటు తమ దేశం సైనిక చర్యలో పాల్గొంటుందని పొరుగు ఉన్న ఐవరీ కోస్ట్ అధ్యక్షుడు అలస్సేన్ ఔట్టారా చెప్పారు. ఐవరీకోస్ట్ ఒక బెటాలియన్ అందిస్తుందని, అన్ని ఆర్థిక ఏర్పాట్లు చేస్తుందని.. నైజర్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వమే తమ లక్ష్యమన్నారు.