ముంబై సమావేశాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. 13 మంది సభ్యులతో కేంద్ర సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని, భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చలను తక్షణమే ప్రారంభించాలని నిర్ణయించింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు ఉమ్మడిగా పోటీ చేయాలని ఈ సమావేశాల్లో తీర్మానించారు. సీట్ల పంపకాలను ఇచ్చి, పుచ్చుకునే పద్ధతిలో సాధ్యమైనంత త్వరగా, ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఈ తీర్మానంలో పేర్కొన్నారు.
‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయడం దేశ రాజకీయాలను వేడెక్కించింది. అయితే, ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. దేశ ప్రజలు మోసపోరని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. నిరంకుశ ప్రభుత్వం నిష్క్రమణకు కౌంట్‌డౌన్ మొదలైందన్న ఆయన.. విపక్ష కూటమి () బలాన్ని చూసి ప్రభుత్వం ఆందోళన చెందుతోందన్నారు. ప్రతీకార రాజకీయాల్లో భాగంగా తమపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రభుత్వం దాడికి పాల్పడే అవకాశం ఉందన్న ఖర్గే.. వాటన్నింటికి సిద్ధంగా ఉండాలని భాగస్వామ్య పక్షాలకు పిలుపునిచ్చారు.
దేశంలోని ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. దేశ ప్రజలు మరోసారి మోసపోరు. 140 కోట్ల భారతీయులు మార్పును కోరుకుంటున్నారు. నిరంకుశ ప్రభుత్వం నిష్క్రమణకు కౌంట్‌డౌన్ మొదలయ్యింది’ అని ఖర్గే పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను తమ నియంత్రణలోకి తీసుకోవాలని భాజపా కోరుకుంటోందన్న ఆయన.. ఇండియా కూటమి బలోపేతం అవుతున్న తరుణంలో తమ నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలతో బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ముంబయిలో రెండోరోజు జరిగిన విపక్షాల కూటమి సమావేశంలో భాగంగా నేతలందరితో దిగిన బృంద ఫొటోను షేర్ చేసిన ఖర్గే.. ‘భారత్ ఏకమవుతుంది.. ఇండియా గెలుస్తుంది’ అనే నినాదాన్ని ఇచ్చారు.
ఈ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఎన్‌సీపీ శరద్ పవార్ వర్గం చీఫ్ శరద్ పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, శివసేన-యూబీటీ నేత సంజయ్ రౌత్, ఆర్జేడీ నేత, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, సమాజ్‌వాదీ పార్టీ నేత జావేద్ ఖాన్, జేడీయూ నేత లలన్ సింగ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, సీపీఐ నేత డీ రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఈ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు. ఈ కమిటీకి కన్వీనర్‌ను ప్రకటించలేదు.