ఈ మధ్య కాలంలో మహిళలపై పురుషుల దౌర్జన్యాలు మరీ ఎక్కువైపోయాయి. వారిని ఇష్టం వచ్చినట్లు తిట్టడం, కొట్టడం, పిశాచాల మాదిరిగా లైంగిక వాంఛ తేర్చుకోవడం వంటివి చేస్తున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రానికి సంబంధించి ఇలాంటి వార్తలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు చేసినా.. పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టినప్పటికీ ప్రతి రోజు ఇలాంటి ఘటనలు ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా ఇలాగే ఓ వ్యక్తి ఒక యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే ఆ యువతి పంచాయతీ పెద్దలకు ఫిర్యాదు చేయగా వారు అతడికి ఆమెతోనే దేహశుద్ది చేయించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని హాపుర్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే .. ఉత్తరప్రదేశ్ లోని హాపుర్ లో ఓ యువతిని అదే గ్రామానికి చెందిన యువకుడు వేధించాడు. ఎన్ని సార్లు చెప్పినా అతడు వినకుండా పదేపదే వేధించడంతో ఆ యువతి విసిగిపోయి తన కుటుంబంతో కలిసి పంచాయతీ పెద్దలకు ఫిర్యాదు చేసింది. దీంతో దీనిపై విచారించిన పెద్దలు యువకుడిది తప్పుగా తేల్చి అతడికి చెప్పు దెబ్బలు శిక్షగా విధించారు. అయితే ఆ యువతే అతడిని కొట్టాలని ఆదేశించారు. 40 సెకన్లలో 15 చెప్పు దెబ్బలు కొట్టాలని పంచాయతీ శిక్ష విధించింది. అయితే యువతి అందరి ముందు ఆ యువకుడిని చెప్పుతో కొట్టింది. తరువాత ఆ యువకుడు ఆమెకు చేతులు జోడించి క్షమాపణలు చెప్పాడు. అనంతరం ఓ వ్యక్తి వచ్చి అతడి చొక్కాను కూడా చింపాడు. చుట్టు పక్కల వారు కూడా ఇలాంటి పనులు ఇంకెప్పుడు చెయ్యవద్దని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా అతడి మెడలో చెప్పుల దండకూడవేశారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొంతమంది పంచాయతీ తీర్పును సమర్థిస్తూ మంచి శిక్ష విధించారని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలా పంచాయతీలు శిక్ష విధించడం సరికాదని ఏదైనా సమస్య వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అభిప్రాయపడుతున్నారు. ఆ యువకుడికి తగిన శాస్తి జరిగిందని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో పోలీసులు కంట పడటంతో వారు స్పందించారు. దీనికి సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వారు తెలిపారు. వీడియో ఆధారంగా కేసును పరిశీలిస్తామని వెల్లడించారు పోలీసులు.