ఇంటి ముంగిట పేడతో కల్లాపి జల్లి.. సున్నంపిండి, బియ్యం పిండి కలిపి.. ముగ్గు పెట్టడం మన సంప్రదాయం.. అయితే ఇప్పుడు లోగిళ్ళు లేవు.. వాకిళ్ళు తక్కువ. దీంతో ముగ్గు అంటే..అపార్ట్మెంట్ ముందు పెట్టె ఎదో రెండు గీతలు అనే స్టేజ్ కు ప్రస్తుత జనరేషన్ ఉంది. అయితే ఈ ముగ్గులను మగువలే కాదు. కొంతమంది మగవారికి కూడా ఇష్టపడతారు. ఇంకా చెప్పాలంటే అలసి సొలసి ఇంటి వాకిలి చేరే మనుషులకు ఇంటి ముందు ముగ్గు సాదర ఆహ్వానం పలుకుతుంది. అంతేకాదు పవిత్ర వాకిలల్లో మెరుస్తున్న ముగ్గులను చూసినా కొన్ని కొన్ని దోషాలు వాటంతట అవే సమసిపోతాయని మన పూర్వీకుల నమ్మకం.
ముగ్గుల్లో గీతాలు ముగ్గులు, చుక్కల ముగ్గులు, లతల ముగ్గులు ఇలా అనేక రకాలున్నాయి. ఇంటి గడప ముందు రెండు అడ్డగీతలు గీసి ముగ్గుని పెడితే.. ఇంటి లోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధి స్తాయని.. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళ కుండా చూస్తాయని నమ్మకం. ఒక ముగ్గు పెట్టి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభ కార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో ముగ్గు వేస్తే.. భూత, ప్రేత, పిశాచాలు ఇంట్లోకి రాకుండా చూస్తుంది. ఇంటి ముందు పద్మ ముగ్గు , చుక్కల ముగ్గులలో అనేక రహస్యాలు ఉన్నాయి. అవి కేవలం గీతాలు మాత్రమే కాదు.. యంత్రాలు కూడా. అందుకనే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.
యజ్ఞగుండం, దైవ కార్యంలో నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి. అయితే నెల మీద దేవతలను, స్వస్తిక్, శ్రీ గుర్తులున్న ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు. దేవాలయంలోనూ, అమ్మవారు, శ్రీ మహావిష్ణువు ముందు రొజూ ముగ్గు పెట్టె స్త్రీకి వైద్యవ్యం రాదని.. సుమంగళిగానే మరణిస్తుందని దేవీ భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి. నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి వేసే ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. పూర్వం రోజూ సాధువులు, సన్యాసులు.. ఇంటిముందు ముగ్గు లేని ఇంటికి వెళ్లి బిక్ష స్వీకరించేవారు కాదు. ఇంటి ముందు ముగ్గులేని ఇల్లు.. అశుభానికి గుర్తు. మరణించిన వారి ఇంటిలో, మరణించిన వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గువేయరు.
కనుక మన సాంప్రదాయ మైన ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మన సంప్రదాయాన్ని మనం కాపాడుకుందాం.. భావితరాలకు వారసత్వంగా అందిద్దాం.