Monday, December 23, 2024
Home ఎడ్యుకేషన్ ప్యాషనే ప్రొఫెషన్ అయితే..?

ప్యాషనే ప్రొఫెషన్ అయితే..?

by Editor
0 comment 377 views
Music Education

ఎలాంటి భావోద్వేగాన్నయినా అందంగా, ఆర్ద్రంగా ప్రదర్శించే ఆ మనసు భాష అర్థం కానిదెవరికి చెప్పండి! ఈ ప్రపంచంలో ఉన్న వందల వేల సంస్కృతుల్లో.. ప్రతి పాట వెనకా ఓ కథ ఉంటుంది, ఏ మూలకు వెళ్లినా దానికి ఆదరణ ఉంటుంది. ఆసక్తితో, ఏకాగ్రతగా సాధన చేయాలే కానీ.. సంగీతం అందించే అవకాశాలకు, పేరు ప్రఖ్యాతులకు కొదవుండదు. మరి మ్యూజిక్‌ను ప్రేమిస్తూ, దీన్నే కెరియర్‌గా మలుచుకోవాలి అనుకునే వారి కోసం.. దీనికి సంబంధించిన కోర్సులు, విద్యాసంస్థలు, ఇతర వివరాలు.. అన్నీ చూద్దామా!

సాధారణంగా సంగీత పరిశ్రమలో గాయకులు, స్వరకర్తలదే ముఖ్యపాత్ర అనుకుంటాం. కానీ ఇందులో ఇంకా ఎన్నో ముఖ్యమైన విభాగాలున్నాయి. ఆడియో ఇంజినీర్లు, సౌండ్‌ టెక్నీషియన్‌, వీడియో ఇంజినీర్‌, ఎలక్ట్రానిక్స్‌ టెక్నీషియన్‌, లిరిసిస్ట్‌, ప్రొడ్యూసర్‌, సౌండ్‌ డిజైనర్‌, పర్ఫామింగ్‌ మ్యూజిషియన్‌, మ్యూజిక్‌ ఎడిటర్‌, స్టూడియో మేనేజర్‌, వోకలిస్ట్‌, మ్యూజిక్‌ పబ్లిషర్‌, మ్యూజిక్‌ థెరపిస్ట్‌, కాపీయిస్ట్‌, మ్యూజిక్‌ రిసెర్చర్‌, క్రిటిక్‌, రేడియో జాకీ, డిస్క్‌ జాకీ, కామెంటేటర్‌, మ్యూజిక్‌ టీచర్‌… వంటి ఎన్నో ఉద్యోగాలు సంగీతానికి ముడిపడి ఉన్నాయి. విద్యార్థులు ఎవరికి ఆసక్తి ఉన్న విభాగంలో వారు ప్రయత్నించవచ్చు.

నచ్చిన పని చేయడంలో ఉన్న సంతోషం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! సంగీతం వృత్తిగా ఆర్థిక ప్రగతిని అందివ్వడమే కాదు, ప్రవృత్తిగా ఆత్మసంతృప్తినీ ఇస్తుంది. పర్యటనలు ఇష్టపడేవారికి ఈ రంగం మరింత నచ్చుతుంది. ఎందుకంటే ప్రదర్శనలు, చిత్రీకరణలు వంటివి ఉన్నప్పుడు దేశ విదేశాల్లో పర్యటించాల్సి వస్తుంది. కాస్త అనుభవం, పేరు సంపాదిస్తే మంచి పారితోషికాలు పొందవచ్చు. ఒత్తిడి లేని, ప్రశాంతమైన జీవన విధానాన్ని అవలంభించవచ్చు.

కోర్సులేం ఉన్నాయంటే…

విద్యార్థికి నచ్చిన సంగీత విభాగాన్ని అధ్యయనం చేసేందుకు ఇప్పుడు అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా వోకల్‌, ఇన్‌స్ట్రుమెంటల్‌ మ్యూజిక్‌, మ్యూజికాలజీ, హిందుస్థానీ, కర్ణాటిక్‌, పర్కుషన్‌ మ్యూజిక్‌లు వంటివి చదవొచ్చు. బీఏ ఆనర్స్‌, ఎంఏ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో విధంగా ప్రవేశాలు జరుగుతాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి పరీక్ష రాస్తే అడ్మిషన్‌ ఇస్తారు.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉన్న ముంబై మ్యూజిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎంఎంఐ) సంగీతానికి సంబంధించి మరింత ప్రత్యేకంగా కోర్సులు అందుబాటులో ఉంచుతోంది. బాలీవుడ్‌ కంపోజింగ్‌, వోకల్‌ (హిందుస్థానీ క్లాసికల్‌ మ్యూజిక్‌), సౌండ్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌, ప్రో మ్యూజిక్‌ ప్రొడక్షన్‌, స్టూడియో సౌండ్‌ ఇంజినీరింగ్‌, మ్యూజిక్‌ ప్రొడక్షన్‌ మాస్టర్స్‌.. ఇలాంటి స్పెషలైజేషన్‌ కోర్సులన్నీ ఒక ఏడాది కాలవ్యవధితో అందుబాటులో ఉన్నాయి. జాకీయింగ్‌ గురించి కూడా ప్రత్యేకంగా చదువుకోవచ్చు.

రీడింగ్‌ అండ్‌ రైటింగ్‌ ఆఫ్‌ నొటేషన్‌, ఇండియన్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, స్టడీ ఆఫ్‌ రాగా, భారతీయ సంగీతం చరిత్ర వంటివి అధ్యయనం చేయవచ్చు.ఆన్‌లైన్‌ కోర్సులు

ఆన్‌లైన్‌లో కోర్సెరా, యుడెమీ, సింప్లీలెర్న్‌.. వంటి అన్ని ప్రధాన వెబ్‌సైట్లలోనూ వివిధ రకాలైన మ్యూజిక్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఫండమెంటల్స్‌, ప్రొడక్షన్‌, ఎలక్ట్రానిక్‌ ప్రొడక్షన్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ ప్లేయింగ్‌ – టెక్నిక్‌, థియరీ, సాంగ్‌ రైటింగ్‌, ఇంప్రొవైజేషన్‌, సింగింగ్‌… ఇలా అన్నీ నేర్చుకోవచ్చు.

విద్యాసంస్థలు

దిల్లీ స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌, లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ, రవీంద్రభారతి యూనివర్సిటీ, విశ్వభారతి వర్సిటీ, గాంధర్వ మహావిద్యాలయ, శ్రీ స్వాతి తిరునాళ్‌ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌, ఇందిరా కళా సంగీత్‌ విశ్వవిద్యాలయ, బెంగాల్‌ మ్యూజిక్‌ కాలేజ్‌ వంటి చోట్ల డిప్లొమా, డిగ్రీ, పీజీ స్థాయుల్లో సంగీతం కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఆంధ్రా, తెలంగాణల్లో ఎంఆర్‌ గవర్నమెంట్‌ మ్యూజిక్‌ కాలేజ్‌ (విజయనగరం), గవర్నమెంట్‌ స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ (నెల్లూరు), ఘంటసాల వెంకటేశ్వరరావు గవర్నమెంట్‌ మ్యూజిక్‌ కాలేజ్‌ (విజయవాడ), శ్రీ త్యాగరాజ గవర్నమెంట్‌ కాలేజ్‌ ఫర్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ (హైదరాబాద్‌), శ్రీ అన్నమాచార్య గవర్నమెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ (హైదరాబాద్‌) వంటి చోట్ల సంప్రదాయ కోర్సులు చదివే వీలుంది.

వ్యాపారంలా…

మ్యూజిక్‌ హాబీ స్థాయి నుంచి వ్యాపారం స్థాయికి వెళ్లే దశలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్కెటింగ్‌, మనీ మేనేజ్‌మెంట్‌ గురించి నేర్చుకోవాలి. ఎక్కువమందిని ఆకర్షించేలా, ఆనందపరిచేలా మన సంగీతం ఉన్నప్పుడే అధికంగా అవకాశాలు దొరుకుతాయనే విషయాన్ని మర్చిపోకూడదు. మార్కెట్‌ వ్యూహం అభివృద్ధి చేసుకోవడం, టార్గెట్‌ ఆడియన్స్‌ను గుర్తించడం, బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచుకోవడం, సొంత మ్యూజిక్‌కు రక్షణ కల్పించడం, స్థిరమైన కాంట్రాక్టులు చేసుకోవడం, బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం వంటివి చేస్తుండాలి. బ్యాండ్‌లుగా పనిచేసేవారైతే వచ్చిన ఆదాయంలో శాతాలవారీగా ఒప్పందం ప్రకారం లాభాలు తీసుకోవడం, కాపీ రైట్ ఓనర్‌షిప్‌, బ్యాండ్‌ ఆపరేషన్‌ ప్రాసెసెస్‌ వంటివాటిపై అవగాహన పెంచుకోవాలి.

ఆన్‌లైన్‌లోనూ..

నేటి కాలంలో సొంతంగా ఇటువంటి పోటీ అధికంగా ఉండే రంగంలో రాణించాలంటే… ఆన్‌లైన్‌లో నిత్యం యాక్టివ్‌గా ఉండటం చాలా ముఖ్యం. ఫొటోలు, వీడియోలు, ప్రోగ్రామ్స్‌ వివరాలు, ప్రొడక్ట్‌ గ్లింప్స్‌ వంటివి విడుదల చేస్తూ ఉండాలి. ఇందుకు నాణ్యమైన విజువల్స్‌, రికార్డింగ్‌ అవసరమవుతాయి. బయో తయారుచేయడానికి హైక్వాలిటీ ఫొటోలు తీయించుకోవడం, ఆల్బమ్‌ కవర్స్‌, లోగోలు వంటివి చేయడానికి అవసరమైన గ్రాఫిక్స్‌ ఉపయోగించడం చేయాలి. అన్ని సోషల్‌ మీడియా ఖాతాలతోపాటు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ వంటిది ఉంటే మరింతగా ప్రేక్షకుల్లోకి వెళ్లొచ్చు.

ఫ్యూజన్‌… ఫ్యూచర్‌!

విభిన్న రకాలైన సంగీతాన్ని మేళవించి కొత్తతరహా ట్యూన్లు, పాటలు చేయడాన్ని ఫ్యూజన్‌ మ్యూజిక్‌ అంటున్నారు. గతకొన్నేళ్లుగా దీనికి ఆదరణ పెరుగుతోంది. భారత్‌లో మెయిన్‌ స్ట్రీమ్‌ మ్యూజిక్‌ అయిన రాక్‌, పాప్‌, జాజ్‌ సంగీతాన్ని శాస్త్రీయ పద్ధతిలో ఉండే హిందుస్థానీ, కర్ణాటిక్‌ పద్ధతులను రంగరించి ఈ ఫ్యూజన్‌ చేస్తున్నారు. ఇది నూతనమైనదే కాదు… వినసొంపుగా కూడా ఉంటుండటంతో ఎక్కువగా దీనిపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. విద్యార్థులు దీన్ని అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా సంస్థలున్నాయి. వాటి కోర్సుల్లో చేరడం ద్వారా ఫ్యూజన్‌ గురించి మరింత తెలుసుకోవచ్చు.

ఉద్యోగావకాశాలు

సొంతంగా మ్యూజిక్‌ వీడియోలు, సినిమాల్లో ప్రయత్నించడంతోపాటు, ఆర్థిక రక్షణ కల్పించే ఉద్యోగాలు కావాలనుకుంటే.. మ్యూజిక్‌ కంపెనీలు, ఇండస్ట్రీ అసోసియేషన్స్‌, ఆర్గనైజ్డ్‌ మ్యూజిక్‌ రిటైలర్స్‌, యాక్టింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌, టెలివిజన్‌ షోలు, టాలెంట్‌ షోలు, అడ్వర్టైజ్‌మెంట్‌ ఇండస్ట్రీలు, వర్క్‌షాప్స్‌, ఈవెంట్‌ ఆర్గనైజర్స్‌, కల్చరల్‌ సెంటర్లు, బ్యాండ్స్‌… ఇలా పలుచోట్ల ప్రయత్నించవచ్చు.

  • ఒకపక్క చరిత్రకు అద్దంపట్టే భారతీయ సంప్రదాయ సంగీతం… మరోపక్క నరనరాల్లో ఉత్తేజం కలిగించి ఉత్సాహం రేపే పాశ్చాత్య సంగీతం… పోకడ ఏదైనా, పాటలో ప్రాణం ఉండాలి! వాద్యం ఏదైనా వింటే హాయిగా ఉండాలి! నిత్యం కొత్తవారు పోటీ పడే ఈ రంగంలో నిలదొక్కుకునేది మాత్రం అతి తక్కువ మంది… కారణం, కళ – నిత్యసాధన – చిత్తశుద్ధి – ఓపిగ్గా ప్రయత్నించడం! ఇవన్నీ మీలోనూ ఉంటే.. ఇంకెందుకు ఆలస్యం!

మరిన్ని…

  • ఇది ఒకచోట కూర్చుని చదివేస్తే వచ్చేసే విద్య కాదు.. ముందు మనలో కొంత కళ ఉండాలి. దాన్ని గుర్తించి పదునుపెట్టాలి. ఏదైనా వాద్యాన్ని ఉపయోగించడం, సంగీతంలో మెలకువలను లోతుగా అధ్యయనం కుమ్క, చేయడం, శబ్దాలను అర్థం చేసుకోవడం, కంపోజింగ్‌.. ఇలా వివిధ రకాలుగా సాధన చేయాలి.
  • సంగీతం సొంతంగా, ఒక్కరుగా చేసుకునే ఉద్యోగం కాదు.. నలుగురితోనూ పరిచయాలు అవసరం. ఎంత బలంగా ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌ అభివృద్ధి చేసుకుంటే… అంత బాగా మార్కెట్‌లో నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది.
  • ప్రొఫెషనల్‌ కోర్సులు చేయడం, ఎప్పటికప్పుడు నైపుణ్యాలకు పదునుపెట్టడం (అప్‌స్కిలింగ్‌) ఈ రంగంలో మరింత ఎదిగేందుకు ఉపకరిస్తుంది.
  • కళకు ఒక గొప్ప లక్షణం ఉంది… సాధన చేసేకొద్దీ అది మరింత మెరుగవుతుంది. ఎంత కొత్తగా ప్రయత్నిస్తే అంత గొప్పగా ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ నేర్చుకుంటున్నట్లే ఉండాలి.. మనకు తెలియనిది ఇంకా ఏదో ఉందనే అనుకోవాలి.. ఆ నిరంతర సాధనలోనే విజయం దాగుంది!

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News