స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అవినీతి రుజువైతే తామే నడిరోడ్డుపై ఉరివేసుకోవటానికి సిద్ధంగా ఉన్నామని ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Achennaidu) స్పష్టం చేశారు. తమ అధినేత చంద్రబాబును అరెస్టు చేసి సీఎం జగన్ తన పీకను తానే కోసుకున్నారని ఆక్షేపించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం – జనసేన పార్టీలు కలిసి 161 స్థానాలతో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తెలుగుదేశం – జనసేన(Telugu Desam – Janasena) కలిశాయని వెల్లడించారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మంగళగిరిలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ చేపట్టిన నిరసన దీక్షను అచ్చెన్న విరమించారు.
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబుకు మద్దతుగా శాంతియుతంగా గంట కొట్టిన వారిపై దుర్మార్గంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. తప్పు చేసిన అధికారులు పాము పుట్టలో దాక్కున్నా వదలబోమని హెచ్చరించారు. చంద్రబాబు(Chandrababu) అక్రమ కేసులో భాగస్వాములైన ఎవ్వరి జీవితాల్లో ఇక సంతోషం ఉండబోదన్నారు. సంబంధం లేని కేసులో చంద్రబాబుని ఇరికించి.. అరెస్టు చేసి 24 రోజులుగా అక్రమంగా జైలులో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ తప్పు చేయని, ఎవరైనా తప్పు చేస్తున్నా అంగీకరించని వ్యక్తి చంద్రబాబు అని అచ్చెన్న అన్నారు.