విరివిగా వాడుతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయ ఇంధనాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అన్ని దేశాలూ ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే ఓ వైపు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్న కేంద్రం.. అటు హైడ్రోజన్‌తో నడిచే వాహనాలకూ పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా హైడ్రోజన్‌తో నడిచే బస్సు కమర్షియల్ ట్రయల్స్‌కు సిద్ధమైంది. సముద్రమట్టానికి అత్యంత ఎత్తులో ఉండే శీతల ప్రాంతమైన లద్దాఖ్ రోడ్లపై పరుగులు పెట్టేందుకు సన్నద్ధమైంది.
హైడ్రోజన్ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రభుత్వరంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్టీపీసీ అశోక్ లేల్యాండ్‌తో కలిసి ఈ బస్సులను రూపొందించింది. ఒక్కో బస్సు ఖరీదు రూ.2.5 కోట్లు. మొత్తం ఐదు బస్సులను లేహ్ అడ్మినిస్ట్రేషన్‌కు ఎన్టీపీసీ అప్పగిస్తోంది. ఇందులో భాగంగా తొలి బస్సు తాజాగా లేహ్ చేరుకుంది. ఈ బస్సుల కోసం లేహ్‌లో ఎన్టీపీసీ రీఫిల్లింగ్ స్టేషన్‌తో పాటు, గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ ఉత్పత్తికి 1.7 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసింది. త్వరలో కమర్షియల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. మూడు నెలల పాటు ఈ ట్రయల్స్ నిర్వహించనున్నారు. సాధారణ బస్సుల మాదిరిగానే ఈ బస్సులోనూ టికెట్ ధరలు వసూలు చేయనున్నారు. హైడ్రోజన్ బస్సుల నడిపే క్రమంలో నష్టాలు వాటిల్లితే ఎన్టీపీసీనే భరించనుంది. వాస్తవానికి ఆగస్టు 15నే ఈ సేవలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ వర్షాలు, కొండచరియలు విరిగిపడడం వంటి ఘటనల కారణంగా వాయిదా పడింది. ఈ తరహా టెక్నాలజీతో వస్తున్న తొలి బస్సు మాత్రమే కాకుండా.. సముద్రమట్టానికి దాదాపు 11,500 అడుగుల ఎత్తులో ఈ బస్సును పరీక్షిస్తుండడం ప్రత్యేకత.