భారత స్వాతంత్ర్య దినోత్సవం వేళ హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బంపరాఫర్ ప్రకటించింది. సూపర్ సేవర్ ఫ్రీడం ఆఫర్ పేరుతో కొత్త పాస్‌ను మెట్రో ప్రయాణికులకు పరిచయం చేసింది. కేవలం రూ. 59 చెల్లించి.. ఈ నెల 12, 13, 15 తేదీల్లో నగరంలో ఎన్నిసార్లు అయినా ప్రయాణించొచ్చు అని హైదరాబాద్ మెట్రో వెల్లడించింది. ఈ అవకాశాన్ని నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ఈ సందర్భంగా ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని సూపర్ సేవర్ ఫ్రీడం ఆఫర్ ప్రకటించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ఆఫర్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, మెట్రోను ఆదరించాలని ఆయన కోరారు.
ఇక హైదరాబాద్ భవిష్యత్ కోసం భారీగా మెట్రో విస్తరణ అవసరమని కేటీఆర్ పేర్కొన్నారు. మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్‌పై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంపై ప్రత్యేకంగా చర్చించారు. నగరంలో రద్దీ, కాలుష్యం తగ్గాలంటే మెట్రోను విస్తరించక తప్పదన్నారు. విశ్వనగరంగా మారాలంటే ప్రజా రవాణా బలోపేతం కావాలన్నారు. మెట్రో విస్తరణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు వేగంగా కార్యక్రమాలు చేయాలన్నారు.
48 ఎకరాల భూమిని మెట్రో డిపో కోసం అప్పగించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మరిన్ని కోచ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఫీడర్ సేవలను మెరుగుపరచడంతో పాటు ఫుట్‌పాత్‌లను అభివృద్ధి చేయాలన్నారు. మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్‌ల కోసం ఇప్పటికే ఉన్న, ప్రతిపాదిత మెట్రో స్టేషన్‌లకు సమీపంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని కేటీఆర్ ఆదేశించారు.