హైదరాబాద్ లోని కోకాపేట భూములకు రికార్డు స్థాయి ధర లభించడంతో భూముల అమ్మకం విషయంలో హెచ్‌ఎండీఏ స్పీడు పెంచింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మరికొన్ని భూములను ఈ-వేలానికి పెడుతున్నది. రంగారెడ్డిలో 8, మేడ్చల్ మల్కాజిగిరిలో 8, సంగారెడ్డి జిల్లాలో 10 ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లకు ఈ నెల 18న ఈ-వేలం నిర్వహించనున్నట్టు ప్రకటిస్తూ బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాలో బైరాగిగూడ, మంచిరేవుల, పీరంచెరువు, కోకాపేట, నల్లగండ్ల, బుద్వేల్, చందానగర్‌లో స్థలాలను అమ్మెందుకు హెచ్‌ఎండీఏ సిద్దపడింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి, బౌరంపేట, చెంగిచర్ల, సూరారం, సంగారెడ్డి జిల్లా వెలిమల, నందిగామ, అమీన్‌పూర్, రామేశ్వరంబండ, పతిఘన్‌పూర్, కిష్ణారెడ్డిపేటలో స్థలాలు విక్రయించనున్నారు. ఈ నెల16 వరకు రిజిస్ట్రేషన్లను స్వీకరించి, 18న రెండు సెషల్‌లో ఈ వేలం నిర్వహించనున్నారు.
మరోవైపు.. బుద్వేల్‌లో హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్‌లోని భూములకు గురువారం ఈ-వేలం నిర్వహించనున్నారు. సుమారు 182 ఎకరాల్లో 17 ప్లాట్లతో హెచ్‌ఎండీఏ ఇక్కడ భారీ లేఅవుట్‌ను రూపొందించింది. ఇందులో 100.01 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 14 ప్లాట్లకు తొలి విడతగా ఈ-వేలం నిర్వహించనున్నారు. ఈ లేఅవుట్‌లో కూడా హెచ్‌ఎండీఏ అధికారులు నియోపొలిస్ తరహాలో మౌలి క వసతులు కల్పించారు. ఏకంగా 36, 45 మీటర్ల మేర రహదారులను నిర్మించారు. లేఅవుట్ నుంచి ఔటర్ రింగురోడ్డుకు విశాల రహదారితో అనుసంధానం చేశారు. ఎయిర్‌పోర్టు మెట్రోతో కేవలం 15 నిమిషాల్లోనే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే అవకాశం ఉన్నది. భారీ హంగులతో రూపొందించిన ఈ లేఅవుట్‌లోని ప్లాట్ల వేలానికి ఈ నెల 4న నోటిఫికేషన్ జారీ చేశారు. గురువారం వేలం ప్రక్రియను రెండు విడతలుగా చేపట్టనున్నారు. ఈ వేలంలో అధికారులు నిర్దేశిత కనీస ధరను ఎకరాకు రూ.20 కోట్లుగా నిర్ధారించారు. తొలి విడత ఈ-వేలం ద్వారా రూ.2 వేల కోట్లకుపైగా ఆదాయం వస్తుందని హెచ్‌ఎండీఏ అంచనా వేస్తోంది.