హైదరాబాద్ అనగానే ఆహార ప్రియులకు గుర్తువచ్చేది ధమ్ బిర్యానీ. దీని రుచి అద్భుతం, సువాసన అమోఘం, తిన్నవారి ఆనందం అపరిమితం అంటారు బిర్యానీ ప్రేమికులు. అయితే బిర్యానీ ఎక్కడ పుట్టింది, దాని చరిత్రను పరిశీలిస్తే.. మనల్ని ఇంతలా ఆకట్టుకుంటున్న బిర్యానీ మన దేశంలో పుట్టలేదంటే ఆశ్యర్యమే. ఇది పశ్చిమాసియా నుంచి దిగుమతి అయిన వంటకం. అయితే దీని పుట్టుకపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే కొంత మంది హైదరాబాద్ నిజాం కాలంలో తొలిసారి బిర్యానీ వంటకం చేశారనే కథ ఎక్కువగా ప్రచారంలో ఉంది.
1630 ప్రాంతంలో హైదరాబాద్‌ను మొఘలులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి నిజాం పాలన మొదలైంది. దాంతో పాటు సాంప్రదాయ మొఘలాయి వంటకాలు.. స్థానిక వంటకాలు మిక్స్ అయ్యాయి. ఆ క్రమంలో ఏర్పడినదే హైదరాబాదీ బిర్యానీ. మొదటి నిజాం-ఉల్-ముల్క్ అసఫ్ జా -I వేటకు వెళ్లినపుడు ఆయన వంటమనిషి మొదటిసారి హైదరాబాదీ బిర్యానీ చేశాడని చెబుతారు. కొందరు దీనికి ఆరు వందల ఏళ్ల చరిత్ర ఉందని వాదిస్తారు. మరికొందరు టర్కీ నుంచి దిగుమతి అయ్యిందంటారు. ఒక పురాణగాథ ప్రకారం, మొఘల్ బాద్షా షాజహాన్ భార్య ముంతాజ్ తమ సైన్యానికి బలమైన ఆహారాన్ని అందించాలని ..పెద్ద మొత్తంలో సులభంగా వండేలా ఉండాలని వంటవాళ్లను ఆదేశించటంతో బిర్యానీ పుట్టింది. ఇక అరబ్ వ్యాపారులు దక్షిణ ఆసియా దేశాలకు వెళ్లినపుడు తమతో తీసుకు వెళ్లిన పులావ్ వంటకం నుంచి బిర్యానీ పుట్టిందని కూడా అంటారు.
అయితే, ఇప్పుడు బిర్యానీల్లో అనేక వెరైటీలు వచ్చాయి.ఇప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు నలబై రకాల బిర్యానీలు ఉన్నాయి. బర్మా, పశ్చిమాసియా, ఆఫ్గానిస్తాన్, ఇండోనేసియా, మలేసియా, సింగపూర్, మారిషస్, ఫిలిపైన్స్, దక్షిణాఫ్రికా, థాయిలాండ్,టర్కీ వంటి దేశాలలో కూడా బిర్యానీ అలరిస్తోంది. ఎక్కడికి వెళ్లినా రెస్టారెంట్ మెనూలో హైదరాబాదీ బిర్యానీ ఉండాల్సిందే. అందుకే అది “కింగ్ ఆఫ్ ఫుడ్”.
బిర్యానీకి రుచి మాత్రమే కాదు.. దానితో ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆఫ్రికన్ జనరల్ అఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నివేదికను విడుదల చేసింది. బిర్యానీ తిన్నపుడు మనసుకు హాయిగా, పని చేయటానికి ఉత్సాహం వస్తుంది. అందులో వాడే వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, కుంకుమ పువ్వు, పసుపు, నల్ల మిరియాలు వంటి దినుసులు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచటంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఏదేమైనా, బిర్యానీని మితంగా తింటేనే ఆరోగ్యానికి మంచిదని ఆ జనరల్ ప్రచురించింది.