ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షురావు తీసుకున్న ‘ఓ సంకల్పం’ పూర్తయింది. హైదరాబాద్ గౌలిదొడ్డిలోని కేశవనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఆధునిక హంగులను సంతరించుకుంది. సౌకర్యాలలేమితో కునారిల్లుతున్న ఈ బడిని హిమాన్షు దత్తత తీసుకున్నారు. తాను సేకరించిన నిధులతో బడిని ఆధునికీకరించారు. బడిలో కొత్తగా కల్పించిన సౌకర్యాలను తన పుట్టిన రోజు సందర్భంగా బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హిమాన్షు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హిమాన్షు భావోద్వేగంగా ప్రసంగించారు.
తాను తొలిసారిగా ఈ బడిని సందర్శించినప్పుడు సౌకర్యాల లేక అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులను చూసి ఎంతో బాధపడ్డానని.. కళ్లలోంచి నీళ్లొచ్చాయని హిమాన్షు పేర్కొన్నారు. బడి అన్నాక కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకపోతే ఎలా? అనే భావన మెదిలి తన మనసు చలించిపోయిందన్నారు. ఆ రోజు తాను బడిలో చూసిన పరిస్థితులను ఆయన కళ్లకు కట్టినట్లు వివరించారు. అప్పట్లో మరగుదొడ్డి వసతి సరిగా లేదని.. బాలికల మరుగుదొడ్డి పరిసరాల్లోనైతే పందులు తిరుగుతుండటాన్ని చూశానని, పిల్లలు అక్కడికి ఎలా వెళ్లగలుతారోనని ఆలోచిస్తే ఎంతో బాధ కలిగిందని చెప్పారు.
బడి పిల్లలు ప్రమాదకర స్థితిలో రాళ్ల మధ్య పరుగెత్తారని.. ఆ రోజే ఓ బాలుడికి దెబ్బ తగిలిందని చెప్పారు. బడిలో మెట్లు కూడా సరిగా లేకుండెనని గుర్తుచేసుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే అక్కడికి వెళ్లాక తన వాహన డ్రైవర్ చెబితే తప్ప అది పాఠశాల అని తాను నమ్మలేకపోయానన్నారు. బడి అంతా కలియతిరిగి తరగతి గదులు, స్టేషనరీ, ఫర్నిచర్ పరిశీలించానన్నారు. ప్రధానోపాధ్యాయుడితో మాట్లాడాలని అడిగి.. ఆయనతో కలిసి ఆఫీసు రూంలోకి వెళ్లాననని అక్కడ విద్యార్ధులంతా కూర్చుని ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. ‘‘మీ ఆఫీసు రూమ్‌లో విద్యార్థులు ఉన్నారేమిటి? సార్?’’ అని తాను ప్రధానోపాధ్యాయుడిని అడిగితే.. ‘‘సార్.. ఇదే మా ఆఫీస్ రూమ్, స్టాఫ్ రూమ్, క్లాస్ రూమ్.. స్టోర్ రూమ్’’ అని ఆయన చెప్పారని.. ఇది తనకు షాక్‌కు గురిచేసిందని హిమాన్షు వివరించారు.
ప్రైవేటు పాఠశాలలో చదువుకున్న తనకు ప్రభుత్వ బడిలోని హెడ్మాస్టర్ గది స్థితిని చూసి మాటల్లో చెప్పలేనంత బాధ కలిగిందని.. ఇట్లాంటివి తాను ఇంతకుమందెప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల స్థితి చూశాక.. బడి ఆధునికీకరణలో భాగంగా ఏవో గోడలు కట్టిస్తే సరిపోదని.. చాలా పనే చేయాల్సి ఉందని అమ్మ శైలిమకు చెప్పానని, అంత ఫండ్ రాలేదని ఆమె నాతో అన్నారుని వెల్లడించారు. తాను రూ.40 లక్షల దాకా సేకరించానని.. వీటికి తోడు డీఈసీ ఇన్‌ఫ్రా మధుసూదన్‌రెడ్డి, అనిరుధ్‌గుప్తా సహకరించడంతో ఆధునికీకరణ పనులు పూర్తిచేశామని చెప్పారు.
డైనింగ్ హాల్, బాలికలు, బాలురకు వేర్వేరు మరుగుదొడ్లు, నీటి సౌకర్యం, ఆధునిక తరగతి గదులు, పాఠశాలకు డిజిటల్ నేమ్‌బోర్డు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నాన్న కేటీఆర్, ఆయన బృందం సహకారంతో పనులను విజయవంతంగా పూర్తిచేశామన్నారు. ఈ బడిని దత్తత తీసుకోవడానికి ప్రధాన స్ఫూర్తి తన తాత కేసీఆరేనని చెప్పారు. చదువుకున్న సమాజంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన ఎప్పుడూ చెబుతుంటారని.. ఆ మాటలతోనే తాను ముందుకు సాగానని పేర్కొన్నారు. అంతకుముందు తన పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థుల సమక్షంలో హిమాన్షు కేక్ కట్ చేశారు. విద్యార్థులకు స్వీట్లు పంచి పెట్టారు. అనంతరం పిల్లలతో కలిసి భోజనం చేశారు.
బడుల దుస్థితికి హిమాన్షు వ్యాఖ్యలే నిదర్శనం’కేశవనగర్ పాఠశాల దుస్థితిని వివరిస్తూ సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చనీయాంశం అయ్యాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని సాక్షా త్తు ముఖ్యమంత్రి మనవడు చెప్పకనే చెప్పారంటూ కొందరు పేర్కొన్నారు. ఓ బడిలోని ఇబ్బందులను హిమాన్షు భావోద్వేగంతో చెప్పడం ప్రభుత్వ పాలనకు అద్దం పడుతోందని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వానివి మాటలే తప్ప చేతలు లేవని మరోసారి స్పష్టమైందని విమర్శించారు. ప్రైవేటు వ్యక్తులు ఇచ్చిన నిధులతో ప్రభుత్వ పాఠశాలను బాగు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని మరికొందరు ప్రస్తావించారు. ‘‘మన ఊరు- మన బడి’’ పేరిట ప్రభుత్వం పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని, విద్యా వ్యవస్థను ఎంతో బాగు చేశామని చెబుతున్నదంతా ప్రచార పటాటోపమేనని విమర్శించారు. సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్లలో చేసింది ఇదేనా..? అంటూ ఇంకొందరు ప్రశ్నించారు. రాష్ట్ర రాజధానిలో, ఐటీ కారిడార్‌లోని ప్రభుత్వ పాఠశాలలోనే కనీస సౌకర్యాలు కరువయ్యాయంటే.. మారుమూల పల్లెల్లోని విద్యా సంస్థల్లో ఇంకెన్ని సమస్యలు ఉంటాయో ఇట్టే చెప్పవచ్చని పేర్కొన్నారు.