అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం(Amalapuram)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. దీంతో పట్టణంలో భారీగా పోలీసులు మోహరించారు.. పలుచోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు.. అమలాపురం మండలం ఈదరపల్లిలో పోలిశెట్టి కిషోర్(Polishetty kishore) అనే యువకుడి హత్య కలకలం రేపింది. శుక్రవారం మధ్యాహ్నం కర్రలతో కిషోర్, అడపా సాయిలక్ష్మణ్‌లపై దాడి జరిగింది. ఈ ఘటనలో కిషోర్ అక్కడికక్కడే మృతిచెందగా, సాయిలక్ష్మణ్ తీవ్రంగా గాయపడ్డాడు. కిషోర్ మృతదేహాన్ని అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడికి పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో ఉద్రిక్తత నెలకొంది. దాడి ఘటనతో ఈదరపల్లికి చెందిన సతీష్, ఇంద్ర, గూడాలకు చెందిన సుధీర్, కొంకాపల్లికి చెందిన ఆనంద్ అనే యువకులకు సంబంధం ఉన్నట్లు గుర్తించామని పోలీసులు చెబుతున్నారు.
200 మంది పోలీసులతో పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. డీఐజీ జీవీజీ అశోక్(GVG ASHOK) ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ పర్యవేక్షణలో దాదాపు 200 మంది సిబ్బందితో బందోబస్త్ ఏర్పాటు చేశారు. అమలాపురంలో ముందుజాగ్రత్త చర్యగా పట్టణంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా.. మాజీ హోం మంత్రి, టిడిపి నేత నిమ్మకాయల చిన రాజప్ప ప్రధాన అనుచరుడు గంధం పళ్ళంరాజుకు చెందిన అమలాపురంలోని రియల్ ఎస్టేట్(Real Estate) కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి దగ్ధం చేశారు. వైసీపీ() నేత హత్యకు ప్రతిక్రియ చర్యగా దుండగులు ఈ ఘటనకు పాల్పడినట్లు భావిస్తున్నారు. అమలాపురం ఎర్ర వంతెన వద్ద సప్తగిరి రెసిడెన్సీ అపార్ట్మెంట్ లో గంధం పళ్ళంరాజు.. రియల్ ఎస్టేట్ కార్యాలయం నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కొంతమంది వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరు ఉంది. ఈ నేపథ్యంలోనే యువకుడిని హత్య చేశారని భావిస్తున్నారు. ఇరు వర్గాలు కొంత మంది రౌడీ షీటర్లను పెంచి పోషిస్తున్నారు. వారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి జరిగిన ఘర్షణ నేపథ్యంలోనే ఈ ఘటనలకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగిన నేపథ్యంలో శాంతిభద్రతలు అదుపుతప్పుతాయన్న ముందస్తు సమాచారం పై పట్టణంలో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.. డీఐజీ జీవీజీ అశోక్ ఆదేశాల మేరకు.. జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ పర్యవేక్షణలో దాదాపు 200 మంది సిబ్బందితో బందోబస్త్ ఏర్పాటు చేశారు.. అమలాపురంలో ముందుజాగ్రత్త చర్యగా పట్టణంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.. ఉభయ గోదావరి జిల్లాల నుండి అదనపు పోలీసు బలగాలను రప్పిస్తున్నారు.. అయితే, మొత్తంగా తాజా హత్య మరోసారి అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా చేసింది.