ప్రముఖులు పోటీ చేసిన స్థానాలో హోరాహోరీ.. కీలక నేతలు బరిలో ఉన్నచోట భారీగా పోలింగ్..
నువ్వా నేనా అన్నట్లు సాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అధ్యక్షులు, ప్రముఖులు పోటీ చేసిన స్థానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఎంఐఎం, సీపీఎం, సీపీఐ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు పోటీ చేసిన స్థానాల్లో నిన్న సాయంత్రం 5 గటల వరకు నమోదైన పోలింగ్ శాతాలను పరిశీలిస్తే.. సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీచేసిన కామారెడ్డిలో 74.86శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ అభ్యర్థుల గెలుపుపై భారీ బెట్టింగులు కాస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిటింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నడుమ అత్యంత ఆసక్తి రేపిన పాలేరులో రికార్డు స్థాయిలో 90.28శాతం ఓట్లు పోలయ్యాయి. కేసీఆర్, బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ పోటీపడిన గజ్వేల్లో 80.32శాతం పోలింగ్ నమోదైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో 74.02 శాతం, బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు కంచుకోట సిద్దిపేటలో 76.29 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పోటీ చేస్తున్న మధిరలో 87.83 శాతం, రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో 88.90 శాతం మంది ఓటేశారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసిన సిర్పూర్ లో 81.16 శాతం, ఈటల సొంత సీటు హుజూరాబాద్ లో 86.31 శాతం పోలింగ్ నమోదైంది. సీపీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బరిలో నిలిచిన కొత్తగూడెంలో 76.50శాతం, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, మంత్రి గంగుల కమలాకర్ ఢీ అంటే ఢీ అని తలపడిన కరీంనగర్ లో 64.17, ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ నియోజకవర్గం చాంద్రాయణగుట్టలో 45 శాతమే పోలింగ్ జరిగింది.