తోషాఖానా కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ నిందితుడిగా శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.. ఇందుకు సంబంధించి ఈ రోజు ఈ కేసుపై ఇస్లామాబాద్ హైకోర్టు విచారించింది. హైకోర్టు ఇమ్రాన్ ఖాన్ శిక్షను సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. తనకు విధించిన మూడేళ్ల శిక్షను నిలిపివేయాలని ఇమ్రాన్ ఖాన్ పెట్టుకున్న పిటిషన్ ని ఇస్లామాబాద్ హైకోర్టు ఈ రోజు విచారించింది. సోమవారం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ కు పడిన మూడేళ్ల శిక్షను సస్పెండ్ చేసింది. ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్‌సి) న్యాయమూర్తుల డివిజనల్ బెంచ్, ప్రధాన న్యాయమూర్తి అమెర్ ఫరూక్ మరియు జస్టిస్ తారిఖ్ మెహమూద్ జహంగిరితో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ఈ కేసుపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది.
ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనకు వచ్చిన బహుమతులను ‘తోషాఖానా’ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలోనే కేసు నమోదైంది. ఈ కేసులో ఇస్లామాబాద్‌లోని జిల్లా, సెషన్స్ కోర్టు ఆగస్టు 5న ఇమ్రాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. అంతేకాకుండా ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. తీర్పు వెలువడిన వెంటనే అరెస్టయిన ఇమ్రాన్.. ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్‌లోని అటక్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేయగా.. ఇస్లామాబాద్ హైకోర్టు దాన్ని నిలిపేసింది.