భారతావని మనసు ఇప్పుడు గర్వంతో ఉప్పొంగిపోతోంది. నెలరాజు గుట్టు విప్పేందుకు నింగిలోకి దూసుకెళ్లిన మన చంద్రయాన్-3 విజయగీతిక వినిపించింది. 140కోట్ల మంది భారతీయుల కలల్ని నిజం చేస్తూ జాబిల్లిపై అడుగు పెట్టింది. పదిహేనేళ్ల క్రితం చంద్రుడిపై నీరుందని తేల్చి విశ్వపరిశోధనల్లో కొత్త శ్వాస నింపిన భారత్.. ఇప్పుడు చంద్రయాన్-3తో జాబిల్లిపై ఎవరూ వెళ్లని దారుల్లో వెళ్లి.. ఎవరూ చూడని ‘దక్షిణ’ జాడల్ని ప్రపంచానికి చూపించింది. దీంతో కొంతమంది ఔత్సాహికులు సినిమా బడ్జెట్స్ తో చంద్రయాన్ బడ్జెట్ను పోల్చిచూస్తున్నారు.
చంద్రయాన్ బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చుతో తీసిన సినిమాలేంటంటే.. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ఆ చిత్ర నిర్మాత, డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత డీవీవీ దానయ్య మొత్తం రూ. 630 కోట్లు ఖర్చు చేశాడు. అందులో రూ. 500 కోట్లు ఆర్ఆర్ఆర్ మూవీ మేకింగ్ బడ్జెట్ కాగా.. మరో రూ. 50 కోట్లు సినిమా ప్రమోషన్స్ కోసం కేటాయించారు. ఇదే కాకుండా ఆస్కార్ అవార్డ్స్ క్యాంపెయిన్ కోసం మరో రూ. 80 కోట్లు వెచ్చించినట్టు నిర్మాత డీవీవీ దానయ్య చెప్పారు.
అంటే ఈ సినిమా కోసం ఆ నిర్మాత పెట్టిన మొత్తం బడ్జెట్ రూ. 630 కోట్లు అన్నమాట. ప్రభాస్, కృతి సనన్ శ్రీరాముడు, సీత పాత్రల్లో, సైఫ్ అలీ ఖాన్ రావణసురుడి పాత్రలో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ ఈ జాబితాలో మొదటి జాబితాలో ఉంది. ఓం రావత్ డైరెక్ట్ చేసిన ఆదిపురుష్ మూవీ కోసం రూ. 500 బడ్జెట్ అనుకున్నారు. కానీ ఆ తరువాత దాదాపు మరో రూ. 200 కోట్లు ఆదిపురుష్ మూవీ గ్రాఫిక్స్ క్వాలిటీ పెంచడం కోసం విఎఫ్ ఎక్స్, సిజిఐ , ప్రమోషన్స్, మార్కెటింగ్ కోసం ఖర్చు చేశారు.
దీంతో సినిమా బడ్జెట్ మొత్తం రూ. 700 కోట్లకు చేరుకుంది. ప్రభాస్, దీపికా పదుకునె ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీ బడ్జెట్ కూడా రూ. 600 కోట్లుగా ఉంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా పూర్తయి, ప్రమోషన్స్, మార్కెటింగ్ అన్ని కలిపి ఈజీగా 700 కోట్ల రూపాయల బడ్జెట్ దాటుతుంది అని ఇండస్ట్రీ బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.