అద్భుతమైన ఔషధ మొక్కలకు మన దేశం నెలవు. ఆధునిక వైద్యం ఎంత అభివృద్ధి సాధించినప్పటికీ.. ఔషధ మొక్కలతో చేసే చికిత్సలకు ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు. ఔషధ గుణాలు కలిగిన మొక్కలను కనుగొనడం, వాటిలోని ఉపయోగాలను పరీక్షించేవారిని హెర్బలిస్టులు అంటున్నారు. స్వదేశంతో పాటు విదేశంలో అవకాశాలు లభిస్తున్న ఈ హెర్బలిజం కోర్సుకి సంబంధించిన వివరాలు..
హెర్బలిజం అంటే ఏమిటి?
మొక్కల్లోని ఔషధ గుణాలను గుర్తించి.. వ్యాధుల నియంత్రణకు, వివిధ ఆహార పదార్థాలు – నూనెల తయారీకి, మెరుగైన జీవన విధానాలను ప్రోత్సహించేలా మనోల్లాస చికిత్సలకు వాటిని ఉపయోగించేవారిని హెర్బలిస్ట్‌లు అంటున్నాం. హెర్బల్ విధానాల్లో పూర్తిగా మొక్కలు, వాటి భాగాల ఉపయోగం మాత్రమే ఉంటుంది.
వీరికి ప్రతి మొక్కలోనూ ఉండే మంచి చెడులు, మనుషులపై అవి చూపించే ప్రభావం… క్షుణ్ణంగా తెలుస్తాయి. వివిధ రకాలైన ఆరోగ్య, మానసిక సమస్యలను పరిష్కరించేందుకు వీరు ఈ మొక్కలను ఉపయోగిస్తారు, హెర్బల్ పద్ధతులనూ అవలంబిస్తారు.
కోర్సులు..
ఈ రంగంలో ప్రవేశించేందుకు కనీసం ఇంటర్ అర్హత ఉండాలి. ఈ సబ్జెక్టు మీద ఇష్టం, ఆసక్తి ఉంటె ఎవరైనా ప్రయత్నించవచ్చు. ఈ రంగంలో వివిధ రకాలైన సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
సర్టిఫికెట్ ఇన్ హెర్బల్ హోమ్ రెమిడీస్, డిప్లొమా ఇన్ హెర్బల్ మెడిసిన్, డిప్లొమా ఇన్ హెర్బల్ ప్రొడక్ట్స్ లాంటి కోర్సుల్లో పదోతరగతి, ఇంటర్ అర్హతతో చేరే వీలుంది.
స్టాండర్‌డైజేషన్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్లాంట్ మెటీరియల్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద), ఎగ్జిక్యూటివ్ డిప్లొమా ఇన్ హెర్బల్ డ్రగ్ టెక్నాలజీ ఫ్రమ్ ఐజీఎంపీఐ, హెర్బలిజం (యుడెమీ), ఆయుర్వేద హెర్బాలజీ, సర్టిఫికేషన్ కోర్స్ ఇన్ ఆయుర్వేద హెర్బలిజం అండ్ ఫార్మకాలజీ, హెర్బల్ మెడిసిన్ కోర్స్ (కోర్సెరా), హెర్బల్ అండ్ హోమ్ రెమిడీస్ లాంటి వాటినీ ప్రయత్నించవచ్చు.
పూర్తిస్థాయిలో దీనిపై అధ్యయనం చేయాలి అనుకునేవారు.. ఎమ్మెస్సీ హెర్బల్ సైన్స్, పీజీ డిప్లొమా ఇన్ హెర్బల్ సైన్స్ లాంటి కోర్సులను ఇండియన్ బోర్డ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ (కోల్‌కతా), ఛత్తీస్‌గడ్ యూనివర్సిటీ (రాయ్‌పూర్), ద్రవిడియన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ హెర్బల్ స్టడీస్ అండ్ నాచురో సైన్సెస్ (చిత్తూరు) లాంటి కళాశాలల్లో పూర్తి చేయవచ్చు.
అయితే ఈ కోర్సులు ఆ రంగానికి సంబంధించిన అవగాహనా కలిపిస్తాయి. ఈ రంగంలో పట్టు సాధించాలంటే నిరంతర శ్రమ, పరిశోధన, ప్రకృతితో మమేకం కావడం ఎంతో ముఖ్యం.
అవకాశాలు ఎలా?
ఇది ఆయుర్వేదం కంటే భిన్నమైన రంగం. ప్రత్యామ్నాయ వైద్య విధానాలను అనుసరించే హెల్త్ సెంట్రల్లో హెర్బలిస్ట్‌లకు అవకాశాలు ఉంటాయి. విదేశాల్లోలోను వీరికి డిమాండ్ బాగా ఎక్కువగా ఉంది. బాగా అనుభవం సంపాదించిన వారు బోధన, శిక్షణ, పరిశోధనలవైపు అడుగేయొచ్చు.
హెర్బలిస్ట్‌లు సొంతంగా ఔషధ మొక్కలు సాగు చేసి ఎగుమతి చేయడం, హెర్బల్ ఉత్పత్తులు తయారుచేసి విక్రయించడం ద్వారా కూడా లాభాలు పొందుతున్నారు. ఈ-ఛరక్ వంటి వెబ్‌సైట్లు ఇందుకు దోహదం చేస్తున్నాయి. అయితే దీనికి తగిన ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి.
ఈ రంగంపై మరింత ఆసక్తి, అవగాహన పెంచేందుకు ఇటీవల బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ‘వర్చువల్ హెర్బేరియమ్’ను ప్రారంభించారు. ఇప్పటివరకూ మన దేశంలో గుర్తించిన ఔషధ మొక్కల పూర్తి వివరాలు, ఎండిన శాంపిల్స్‌ను ఈ డేటాబేస్‌లో ఉంచుతున్నారు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఆ వివరాలు చూసే వీలుంది.