అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు జోరందుకున్నాయి. గత రెండు రోజులుగా హైదరాబాద్ (Hyderabad) సహా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండ కురుస్తున్నాయి. వీటికి తోడు ఎగువ ప్రాంతాల్లో నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టుల్లో క్రమంగా నీటిమట్టాలు పెరుగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్(Nijamabad) జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు భారీ ప్రవాహం వస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి.. దిగువన గోదావరి నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో(In Flow) భారీగా వస్తుండగా.. 4 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 90(Project Capacity) టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 89.7 టీఎంసీలతో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది. గేట్లు ఎత్తడంతో గోదావరి నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి ఎగువన ఉన్న ఆదిలాబాద్(Adilabad) జిల్లా ప్రాంతంలో కురుస్తున్న వర్షానికి జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. కడెం(Kadem Project) జలాశయంలోకి 13,300 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో.. 3 వరద గేట్ల ద్వారా 29,889 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కడెం జలాశయం(Kadem Project) పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 696.52 అడుగులకు చేరింది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు(Nijam sagar Project)లోకీ వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,500 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,405 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1,403.7 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలకు గానూ.. ప్రస్తుత నీటి నిల్వ 16 టీఎంసీలుగా ఉంది.
నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి కురుస్తోన్న వర్షంతో జిల్లా కేంద్రమంతా జలమయమైంది. నగరంలోని రైల్వేస్టేషన్, బస్టాండ్, వీక్లీ మార్కెట్, బోధన్ రోడ్డులోని మాలపల్లి రహదారులు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయాయి. వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని పులాంగ్ వాగు వరద నీటితో పరుగులు పెడుతోంది.వెంగల్‌పాడ్ వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో దర్పల్లి-సిరికొండ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో భారీ వర్షం కురుస్తోంది. పాతికేళ్లలో ఎన్నడూ లేనివిధంగా.. గాంధారి(Ghandhari brook) వాగుకు వరద పోటెత్తింది. వరద ప్రవాహానికి దిగువన ఉన్న వరి పొలాలు నీట మునిగాయి. వాగు సమీపంలో ఉన్న కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది.