కేరళలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కుంభవృష్టి కురుస్తున్నది. దాంతో పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పోటెత్తిన వరదలవల్ల ఇప్పటికే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలు ప్రాంతాలు నీట మునిగడంతో ఆయా ప్రాంతాల జనాన్ని రెస్క్యూ టీమ్‌లు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇడుక్కి, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్.. తిరువనంతపురం సహా మరో 12 జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. కేరళ, కర్ణాటక తీర ప్రాంతాల్లో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. కన్నూర్, కాసర్‌గోడ్, ఎర్నాకులం, అలప్పుజా జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.
అత్యవసర ఆపరేషన్ సేవలు సిద్ధంగా ఉండాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశాలు జారీ చేశారు. ఇడుక్కి, మలప్పురం, అలప్పుజా, వాయనాడ్, కోజికోడ్, త్రిసూర్, పతనంతిట్ట జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు. రెడ్ అలర్ట్ ఒక రోజులో 20 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం, ఆరెంజ్ అలర్ట్ 20 సెం.మీ వరకు వర్షపాతాన్ని సూచిస్తుంది. ఇడుక్కి, కన్నూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఇల్లు, పంటలు దెబ్బతిన్నాయి.
పాలక్కడ్ జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పొలాల్లో పనిచేస్తున్న ఓ మహిళ కొబ్బరి చెట్టు కూలి మృతిచెందారు. పలు జిల్లాల్లో చెట్లు కూలి వాహనదారులు గాయపడ్డారు. పలు చోట్ల వర్షం నీరు ఇళ్లను చుట్టుముట్టడంతో జనం అవస్థలు పడుతున్నారు. మంగళవారం అలప్పూజ జిల్లా చెర్తాలాలో 15 సెం.మీ., కాసర్‌గోడ్ జిల్లా కుడ్లులో 14 సెం.మీ., కుమరకోమ్‌లో 13 సెం.మీ. వర్షపాతం నమోదయ్యింది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారులపై ప్రయాణాలు మానుకోవాలని ప్రజలకు అధికారులు సూచించారు.
ఇటు, కర్ణాటకలోనూ గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలకు అనేక ప్రాంతాలను వరద ముంచెత్తింది. మరో ఐదు రోజుల పాటు కేరళ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ హెచ్చరికలతో దక్షిణ కన్నడ ప్రాంతంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని ప్రజలకు సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.