భారీ వర్షానికి కడప జిల్లా అతలాకుతలం అయింది. గురువారం తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మురుగు కాలువలు పొంగి రోడ్లపైకి వచ్చి ప్రవహించాయి. ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, అంబేడ్కర్ కూడలి, కోర్టు రోడ్డు, భరత్ నగర్, చెన్నై రోడ్డు, మృత్యుంజయ కుంట, గంజికుంట కాలనీ, అక్కయ్యపల్లి, ప్రకాష్ నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరదనీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రహదారులపై మోకాల్లోతు వరకు వర్షపు నీరు చేరడంతో వాహనాలు మొరాయించాయి. కళాశాలలు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. అక్కయ్యపల్లెలోని పాత గోడ కూలిపోవడంతో స్థానికులు భయాందోళన గురయ్యారు. దీంతో రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని తొలగించేందుకు నగరపాలక అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.