హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం(Heavy Rains) దంచికొట్టింది. మేడ్చల్ నుంచి క్రమక్రమంగా మొదలైన వర్షం నగరమంతటా విస్తరించింది. నగరంలోని చార్మినార్, బహదుర్‌పురా, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, బార్కస్, ఫలక్‌నుమా ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. కోఠి, అబిడ్స్, బేగంబజార్, నాంపల్లి, బషీర్బాద్, లక్డీకాపూల్, హిమాయత్‌నగర్, ట్యాంక్‌బండ్(Tankbund), ఆసిఫ్‌నగర్, మెహిదీపట్నం, మాసాబ్‌ట్యాంక్, బోరబండ, మోతినగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, మధురానగర్, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్(Banjara Hills), నిజాంపేట, బాచుపల్లి, గండి మైసమ్మ, కృష్ణాపూర్, దుండిగల్, కేపీహెచ్‌బీ, మైత్రివనం, మాదాపూర్, కీసర, మల్కాజిగిరి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, బాలనగర్, గుండ్ల పోచంపల్లి, బహదూర్‌పల్లి, సూరారం, సుచిత్ర, జగద్గిరి గుట్ట(Jagadgiri Gutta) ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఖైరతాబాద్ రైల్వేగేట్ వద్ద రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. యూసఫ్‌గూడ, శ్రీకృష్ణా నగర్, పూర్ణ టిఫిన్ సెంటర్ వీధిలోని దుకాణాల్లోకి వరద నీరు చేరుకుంది. నాగారంలో సుమారు గంట సేపు భారీవర్షం కురిసింది. ఈసీఐఎల్‌లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. విజయనగర్ కాలనీలో ఇళ్లలోకి చేరిన వర్షపు నీటితో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు.
సికింద్రాబాద్, బోయినపల్లి(Boinapally), మారేడుపల్లి, చిలకలగూడ, ప్యాట్ని, పారడైజ్, బేగంపేట్, అల్వాల్ ప్రాంతాలలో వర్షం కురుస్తోంది. కుండపోతగా పడుతున్న వర్షానికి రహదారులన్నీ జలమమయ్యాయి. ఏకధాటిగా కురుస్తుండడంతో వాహనదారులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా పలుచోట్ల డ్రైనేజీలు(Drainages) పొంగిపొర్లాయి. అకస్మాత్తుగా కురిసిన వాన నీరంతా రోడ్లపై నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు.. రాష్ట్రంలో బుధవారం కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావారణ కేంద్రం(Hyderabad Meteorological Centre) తెలిపింది. గురు, శుక్రవారాల్లో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే విధంగా రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.