భారీ వర్షాల కారణంగా చైనాలోని హెబెయ్ ప్రావిన్స్‌ను వరదలు ముంచెత్తాయి. ఈ వరదల వల్ల ప్రావిన్స్‌లోని లోతట్టు ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొత్తం 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది గల్లంతయ్యారు. ఈ ప్రకృతి విపత్తు హెబెయ్ ప్రావిన్స్‌కు 95.811 బిలియన్ యువాన్‌ల నష్టాన్ని మిగిల్చిందని అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో హెబెయ్ ప్రావిన్స్‌లో వరదలు పోటెత్తాయని చైనా ఆర్థికమంత్రి చెప్పారు. ఈ ప్రకృతి విపత్తును ఎదుర్కోవడానికి అదనంగా 1.46 బిలియన్ యువాన్‌లను ఆర్థిక సాయంగా అందించినట్లు ఆయన తెలిపారు. వివిధ వరద ప్రభావిత రీజయన్లలో పునరావాస చర్యల కోసం ప్రభుత్వం ఇప్పటికే 7.738 బిలియన్‌ల నిధులను మంజూరు చేసిందని, తాజా నిధులు అందుకు అదనమని పేర్కొన్నారు.
డోక్సూరి తుపాను కారణంగా చైనా అల్లాడిపోతున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా ఆ దేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. ముఖ్యంగా రాజధాని బీజింగ్ వరదలకు అతలాకుతలమైంది. పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో రోడ్లు, ప్రధాన వీధులు, నివాస సముదాయాలన్నీ నదులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ వంతెనలు తెగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరద నీటిలో కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోతున్నాయి. 5 లక్షల మందికిపైగా ప్రజలు ఈ వరదలకు ప్రభావితులయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
చైనా రాజధాని బీజింగ్‌తో పాటు దాని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆ తర్వాత వాతావరణ శాఖ బుధవారం (ఆగస్టు 2) బీజింగ్‌లో ఇటీవలి రోజుల్లో కురిసిన వర్షాలు 140 సంవత్సరాల క్రితం సంభవించిన భారీ వర్షాల రికార్డును బద్దలు కొట్టాయని తెలిపింది. ఈ తుఫాను సమయంలో అత్యధికంగా 744.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని బీజింగ్ వాతావరణ శాఖ తెలిపింది.చాంగ్‌పింగ్‌లోని వాంగ్జియాయువాన్ రిజర్వాయర్‌లో ఈ వర్షం కురిసింది. గత 140 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతం. ఫిలిప్పీన్స్‌లో దోక్సూరి తుఫాను బీభత్సం సృష్టించింది. దక్షిణ ఫుజియాన్ ప్రావిన్స్‌ను తాకిన తర్వాత, అది చైనా ఉత్తర దిశగా కదిలింది.
ఇదిలా ఉంటే చైనా దేశంలో ఆగస్టు నెలలో పలు టైఫూన్లు తాకే అవకాశం ఉందని ఆ దేశ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. చైనాలో భారీ వర్షాల మధ్య, ఉత్తర. దక్షిణ చైనాలోని పలు ప్రాంతాల్లో ఆగస్టులో రెండు లేదా మూడు టైఫూన్‌లు దేశవ్యాప్తంగా తీరాన్ని తాకే అవకాశం ఉన్నందున వరదలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. డోక్సూరి టైఫూన్ వల్ల బీజింగ్, హెబీ ప్రావిన్సు ప్రాంతాల్లో భారీవర్షాలు కురవడం వల్ల వరదలు వెల్లువెత్తాయి.