గత ప్రభుత్వ నిర్ణయాలను పునఃసమీక్షించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం(Government of Andhra Pradesh) మంత్రివర్గ ఉపసంఘం, సిట్ ఏర్పాటును సవాలు చేస్తూ టీడీపీ(TDP) వేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు(High Court) ఆదేశించింది. ప్రభుత్వం చేసే కౌంటర్‌కు ప్రతి కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లకు సూచించింది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రాజెక్టులు, కార్యక్రమాలు, ఏర్పాటు చేసిన సంస్థలు, కార్పొరేషన్లపై సమీక్షకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ 2019 జూన్ 26న ప్రభుత్వం జీవో జారీచేసింది.ఉపసంఘం ఇచ్చిన నివేదికలోని అంశాల ఆధారంగా దర్యాప్తు చేసేందుకు పదిమంది పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తూ 2020 ఫిబ్రవరి 21న జీవో 344 జారీచేసింది.
ఈ రెండు జీవోలను సవాలు చేస్తూ.. తెలుగుదేశం నేతలు వర్ల రామయ్య(Varla Ramaiah), అలపాటి రాజా(Alapati Raja) హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. వాటిపైన విచారణ జరిపిన.. హైకోర్టు సింగిల్ జడ్జి తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ.. 2020 సెప్టెంబర్ 16న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.ఆ ఉత్తర్వులను ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేయగా.. కేసులోని మెరిట్స్ ఆధారంగా తుది నిర్ణయం వెల్లడించాలని హైకోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో.. ఈ వ్యాజ్యాలు శనివారం హైకోర్టులో విచారణకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ న్యాయవాది.. కౌంటర్ వేసేందుకు 3 వారాల సమయం కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ (AG Sriram)స్పందిస్తూ.. సిట్ పరిధిలోని నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధులు కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో తాజాగా పిల్ దాఖలైందని గుర్తుచేశారు.
ఆ వ్యాజ్యం విచారణకు వస్తే అందులోనూ కేంద్ర ప్రభుత్వం వైఖరిని తెలపాల్సి ఉందన్నారు. ఇరువైపు వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి కౌంటర్ ప్రతి కౌంటర్ దాఖలు చేయాలని న్యాయవాదులను ఆదేశిస్తూ విచారణను అక్టోబర్ 20కి వాయిదా వేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన విధానపరమైన నిర్ణయాలు, ప్రాజెక్టులు, కార్యక్రమాలు, ఏర్పాటు చేసిన సంస్థలు, కార్పోరేషన్లు, సొసైటీలు, కంపెనీలు, ముఖ్యపాలనా అనుమతుల్ని సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ 2019 జూన్ 26న ప్రభుత్వం జీవో 1411 జారీచేసింది.
గత ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని పునఃసమీక్షించే విశృంఖలాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండవన్నారు. పరిమితులకు లోబడి కొన్ని అంశాల్లో సమీక్ష చేస్తున్నట్లు కనిపించడం లేదని తప్పుపట్టారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2023 మే 03న విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. అపరిపక్వదశలో హైకోర్టు జీవోలపై స్టే ఇచ్చిందని అభిప్రాయపడింది.