కోపంతో ఓ దుర్మార్గుడు ఏకంగా కుటుంబాన్నే పొట్టన పెట్టుకున్నాడు. పెంపుడు కుక్కను కొట్టవద్దని వారించినందుకు ఓ ఉన్మాది ఏకంగా భార్యాపిల్లలనే అతిదారుణంగా చంపేశాడు. ఆపై తాను కూడా కత్తితో పొడుచుకొని చనిపోయాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అక్కడి స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉజ్జయిని జిల్లా బాద్‌నగర్ ప్రాంతంలో దిలీప్ పవార్ (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సరకు రవాణా ఆటో డ్రైవర్‌గా జీవనం సాగించే అతను మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల తన ఆటోను విక్రయించి ఖాళీగా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత తన పెంపుడు కుక్కను అదేపనిగా కొట్టడం ప్రారంభించాడు. దాని అరుపులు విన్న కుటుంబ సభ్యులు లేచి ఏం జరుగుతోందోనని మేల్కొని చూశారు. కుక్కను కొట్టొద్దని అతడి భార్య గంగ (40), కుమారుడు యోగేంద్ర (14), కుమార్తె నేహా (17) అతడిని వారించారు.
దీంతో కోపంతో రగిలిపోతున్న పవార్ ఆవేశంతో కత్తి తీసుకుని తన భార్య, ఇద్దరు పిల్లలను క్రూరంగా పొడిచిచంపేశాడు. మరో ఇద్దరు చిన్నారులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఇంట్లో నుంచి పారిపోయారు. కాసేపటి తరువాత నిందితుడు తనను తాను పొడుచుకొని చనిపోయాడు. ఘటన జరిగిన సమయంలో అతడు మద్యం సేవించాడా? లేదా? అనే వివరాలు తమకు తెలియలేదని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో హత్యల గురించి సమాచారం వచ్చిందని పేర్కొన్నారు.
మరోవైపు.. తండ్రిని చంపేసి మూడు రోజులు ఇంట్లోనే దాచిన ఘటన తీవ్రంగా కలిచి వేస్తోంది. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా దూదేకులపల్లిలో భూ తగాదాలతో తండ్రిని కుమారుడు హతమార్చాడు. ఈ నెల 16న ధనుంజయ్ తన తండ్రి తిరుపతిని కర్రతో దాడి చేసి హత్య చేశాడు. 3 రోజుల పాటు తండ్రి మృతదేహాన్ని ఇంట్లోనే దాచి ఉంచాడు. తండ్రి కనిపించడం లేదంటూ 3 రోజులు ఊరు మొత్తం తిరిగాడు. శనివారం రాత్రి తండ్రి మృతదేహాన్ని కుమారుడు చెరువులో పడేశాడు. అక్కడ నుంచి వస్తుండగా పెట్రోల్ అయిపోవడంతో బైక్ ఆగిపోయింది. ధనుంజయ్ వద్ద కుళ్లిన వాసన రావడంతో గ్రామస్థులు అతడిని నిలదీశారు. దీంతో తన తండ్రిని హత్య చేసినట్లు ధనుంజయ్ అంగీకరించాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.