తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru-Rangareddy Project)పై రాష్ట్ర బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని.. పాలమూరు ప్రాజెక్ట్ అంటేనే పెండింగ్ ప్రాజెక్టులు అనేలా కాంగ్రెస్ నేతలు మార్చేశారని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడే పనులను కూడా ప్రతిపక్షాలు స్వాగతించలేని దుస్థితిలో ఉన్నాయని దుయ్యబట్టారు. ఎన్నో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు(Opposition parties) యత్నించాయని ఆరోపించిన ఆయన.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పాలమూరు ప్రాజెక్టు ఆగలేదని స్పష్టం చేశారు. నేడు ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ప్రజలకు అవసరమైన పనులనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం(BRS Govt) చేస్తోందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పని చేసే ప్రభుత్వాలనే ప్రజలు మళ్లీ మళ్లీ కోరుకుంటారని తెలిపారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో నోబెల్స్‌కు, గోబెల్స్‌కు మధ్య పోరాటం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రంలోని ఎంబీబీఎస్(MBBS) సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే వస్తున్నాయన్న ఆయన.. అతి తక్కువ ఫీజుకే పేద విద్యార్థులు వైద్య విద్యను పూర్తి చేసుకుంటారని అన్నారు. ధాన్యం, వైద్యుల ఉత్పత్తిలో ఇప్పుడు తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందని వివరించారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలుస్తోందన్న మంత్రి.. ఇప్పుడు ఏ కాలంలో చూసినా కాలువల్లో నీరు పారుతోందని హర్షం వ్యక్తం చేశారు.
బీజేపీ నాయకులు పాలమూరు ప్రాజెక్టుపై విమర్శలు చేస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టు అంటేనే పెండింగ్ ప్రాజెక్టులు అనేలా కాంగ్రెస్ నేతలు మార్చేశారు. ప్రజలకు ఉపయోగపడే పనులను కూడా ప్రతిపక్షాలు స్వాగతించలేని దుస్థితిలో ఉన్నాయి. ఎన్నో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు యత్నించాయి. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. పాలమూరు ప్రాజెక్టు ఆగలేదు. – మంత్రి హరీశ్‌రావు