తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలను రీ-షెడ్యూల్ చేసినట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. నవంబరు 2, 3 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.
గ్రూప్ -2 కు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 29, 30 తేదీల్లో గ్రూప్ -2 పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా వరుసగా ఇతర పోటీ పరీక్షలు కూడా ఉండడంతో గ్రూప్ -2 పరీక్షలు వాయిదా కోసం అభ్యర్థులు, విపక్ష నేతలు ఇటీవల ఆందోళనలు చేపట్టారు. లక్షల మంది అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 29,30 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయాలని కొద్ది రోజులుగా అభ్యర్థులు ఆందోళనలు నిర్వహించారు. దీంతో సీఎం కేసీఆర్ గ్రూప్-2 పరీక్షను వాయిదా వేసి.. రీషెడ్యూల్ చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ శాంతి కుమారి టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శితో చర్చించి నవంబరుకు గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలుపుతూ.. నేడు పరీక్ష తేదీల షెడ్యూల్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది.
ఈ క్రమంలో టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్2 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని సీఎం కేసీఆర్‌ను మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. అనంతరం పరీక్షను వాయిదా వేస్తున్నట్లు సీఎం కేసీఆర్ సీఎస్‌ను ఆదేశించారు. అందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ.. లక్షలాది మంది అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో కూడా నియామక ప్రకటనల జారీలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సూచించినట్లు మంత్రి ట్విటర్ వేదికగా వెల్లడించారు.