తెలంగాణ లోని టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపింది. డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీలో 2,575 ఎస్‌జీటీ,1739 స్కూల్ అసిస్టెంట్, భర్తీ చేయనుండగా..మరో వైపు611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టుల భర్తీకి విధివిధానాలు ఖరారుచేసి, రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని ఇది వరకే విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. పాఠశాల విద్యలో 5,089 పోస్టులు, మరో 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని వెల్లడించారు. జిల్లాలవారీగా నోటిఫికేషన్లు జారీచేసేందుకు అధికారులకు ఆదేశాలిచ్చామని తెలిపారు. ఇప్పటికే టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశామని, ఈ పరీక్ష సెప్టెంబర్ 15న జరగనున్నదని పేర్కొన్నారు. తెలంగాణలో డీఎస్సీ ద్వారా 5,089 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా ఇందులో జిల్లాల వారీగా చూసుకుంటే.. అత్యధికంగా హైదరాబాద్-358, నిజామాబాద్-309, ఆసిఫాబాద్-289, సంగారెడ్డి- 283, ఆదిలాబాద్-275 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.