పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతికి గ్రీన్ సిగ్నల్ పడింది. పథకం నిర్మాణపనులు వేగంగా చేపట్టేందుకు రూట్ క్లియర్ అయింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్మిస్తున్న ఈ ఎత్తిపోతల పథక నిర్మాణానికి పర్యావరణ అనుమతుల కమిటీ షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ పరిధిలోని పర్యావరణ అనుమతుల కమిటీ గత నెల 24వ తేదీన నిర్వహించిన 49వ సమావేశం మినిట్స్‌ను గురువారం విడుదల చేసింది. పాలమూరు ఎత్తిపోతల పనుల్లో పర్యావరణపరమైన ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని ఇందుకుసంబంధించి ఉపశమన చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు అథారిటీని ఈఏసీ ఆదేశించింది. ఆయా చర్యలను నిర్దేశిస్తూ.. ఆమోదం తెలిపింది.
ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని 12.38 లక్షల ఎకరాలకు సాగునీరు, వేల గ్రామాలకు తాగునీరు అందించేందుకు 2016లో ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల నిర్మాణం చేపట్టింది. శ్రీశైలం జలాశయం వెనుక జలాల నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున అరవై రోజుల్లో 90 టీఎంసీలను ఎత్తిపోసేందుకు ఈ పనులను ప్రారంభించింది. ఇందులో 4 లిఫ్టులు, అయిదు జలాశయాలు ఉన్నాయి. నార్లాపూర్ జలాశయం 89.44 శాతం, ఏదుల 90, వట్టెం 70, కరివెన 60, ఉదండాపూర్ జలాశయం 48 శాతం పనులు పూర్తయ్యాయి. వివిధ దశల్లో పనులు పూర్తయినట్లు 22నెలలకు ముందు ఈఏసీ నిర్వహించిన అధ్యయన నివేదిక పేర్కొంటోంది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించడం సంతోషకరమని సీఎం కేసీఆర్ అన్నారు. కృష్ణమ్మ నీటితో పాలమూరు పాదాలు కడిగే రోజు ఆసన్నమైందని తెలిపారు. ఎన్నో కేసులు, అడ్డంకులను ఎదుర్కొని, అకుంఠిత దీక్షతో ఈ అనుమతులను సాధించామని… ఇది తెలంగాణ సాధించిన మరో అద్భుత, చారిత్రక విజయమని పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులపై అభినందనల జల్లు కురిపించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాలకు సాగునీరందించే ఈ పథకం తొలిదశ పనులు ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయని… ఇక రెండోదశ పనులూ వేగంగా కొనసాగుతాయని వెల్లడించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రావడం అపూర్వమైన ఆనందాన్నిస్తోందని.. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ‘ కుట్రలను ఛేదించి, కేసులను అధిగమించి దశాబ్దాలుగా అన్యాయానికి, వివక్షకు గురైన పాలమూరుకు కృష్ణమ్మ పరుగుపరుగున రానుందని… ఇది మాటల్లో వర్ణించలేని మధురఘట్టమంటూ హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్మాణమవుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు రావడంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడం కోసం ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేయగా… కేంద్రం అనేక కొర్రీలు పెట్టిందన్నారు. దశాబ్దాలుగా వివక్షకు గురైన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణమ్మ నీటిని మళ్లించి సస్యశ్యామలం చేస్తామని మంత్రి అన్నారు.