ఆంధ్ర ప్రదేశ్ లో అనేక చోట్ల గణేశ్ నిమజ్జనోత్సవాలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరం (Rajamandri) లోని గోదావరి పుష్కర్ ఘాట్ (Godavari Pushkar Ghat) వద్ద వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి విగ్రహాలు ఊరేగింపుగా తరలించారు. అనంతరం గోదావరి ఒడికి చేర్చారు. విశాఖలో వివిధ మండపాల నుంచి బయలు దేరిన గణనాథుడి విగ్రహాలను సాగర తీరంలో నిమజ్జనం చేశారు. మహిళలు, పిల్లలని తేడా లేకుండా అందరూ లంబోధరుడి ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు.
కర్నూలులో ఏర్పాటు చేసిన 56 అడుగుల భారీ మట్టి వినాయకుని నిమజ్జనం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విగ్రహం ఏర్పాటు చేసిన చోటే ఫైర్ ఇంజన్ల సహాయంతో నిమజ్జనం చేశారు. తిరుపతి(Tirupathi) జిల్లా తుమ్మలగుంటలో వినాయక నిమజ్జనం వేడుకలు అంగరంగా వైభవంగా జరిగాయి. 30 అడుగుల నెమలిపించ వినాయకుడి ప్రతిమను ఏర్పాటు చేసి 11 రోజుల పాటు పూజలు నిర్వహించారు. వినాయక నిమజ్జన వేడుకలు కోలాహలంగా జరిపారు.
ఇక గురువారం ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతి (Khairatabad Ganesh) నిమజ్జనం భక్తజనుల సందడి మధ్య ఘనంగా ముగిసింది. పదిరోజులపాటు భక్తుల నీరాజనాలు అందుకున్న లంబోదరుడు.. గంగమ్మ ఒడికి చేరుకునున్నాడు. లక్ష్మీ నరసింహస్వామి, వీరభద్రుడి సమేతంగా.. శ్రీదశ విద్యా మహా గణపతిగా ఈసారి గణనాథుడు(Lord Vinayaka) భక్తుల నీరాజనాలందుకున్నాడు. బుధవారం అర్థరాత్రి చివరిసారిగా కలశపూజ నిర్వహించిన తర్వాత.. పార్వతీ తనయుడిని టస్కర్‌పైకి చేర్చారు.
హైదరాబాద్‌లో(Hyderabad) గణేష్ నిమజ్జనోత్సవం కోలాహలంగా సాగుతోంది. వేల మంది భక్తుల నడుమ గణేష్ శోభాయాత్రలు ఘనంగా సాగుతుండగా.. ఖైరతాబాద్(Khairathabad) వినాయక నిమజ్జనం పూర్తి అయింది. పోలీసుల భారీ బందోబస్తు నడుమ ఖైరతాబాద్ వినాయకుడు గంగమ్మ ఒడిని చేరాడు. ఖైరతాబాద్ గణేషుడి వద్ద బుధవారం అర్ధరాత్రి దర్శనాలు నిలిపేశారు. రాత్రి 12 గంటలకు చివరి పూజ నిర్వహించారు. గురువారం వేకువ జామునే ఖైరతాబాద్ పార్వతీ తనయుడి విగ్రహాన్ని తరలించడం ప్రారంభించారు.
వినాయ నిమజ్జనానికి( Vinaya immersion) ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆర్టీఏ తరఫున 2 వేల వాహనాలు, జీహెచ్‌ఎంసీ 250కిపైగా క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య నిర్వహణకు మూడు వేల మంది సిబ్బందిని నియమించారు. 50 వేల మంది పోలీసులతో భారీగా బందోబస్తు నిర్వహించారు. నిమజ్జనానికి హుసేన్ సాగర్‌తో పాటు 33 చెరువులను సిద్ధం చేసింది ప్రభుత్వం. ఇక్కడ 250 మంది స్విమ్మర్లు, 400 మంది డీఆర్‌ఎఫ్ బృందాలను రెడీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేకంగా వంద వరకు కృత్రిమ చెరువులు నిర్మించారు.