తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Governor Tamilisai) తాజాగా ఆర్టీసీ విలీన బిల్లు(TSRTC Merger Bill)కు ఆమోదం తెలిపారు. తాను చేసిన 10 సిపారసుల విషయంలో ప్రభుత్వ స్పందనపై సంతృప్తి చెందానని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తన సిఫారసులకు సంతృప్తకరమైన సమాధానం ఇచ్చినందుకు ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ(TSRTC ) ఉద్యోగులకు గవర్నర్ తమిళిసై అభినందనలు తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీలోని 43,373 మంది సిబ్బంది సంక్షేమమే లక్ష్యంగా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ.. ఇటీవల మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆ బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అనుమతి కోసం పంపారు. అది సాంకేతికంగా ఆర్థిక బిల్లు కావడంతో రాజ్‌భవన్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అలా పంపిన బిల్లును గవర్నర్ అప్పటికప్పుడే ఆమోదించలేదు.
ఆర్టీసీ విలీన బిల్లులోని కొన్ని అంశాలపై గవర్నర్(Governor Tamilisai)) అభ్యంతరం తెలిపారు. ఆర్టీసీ విభజన, కార్మికుల జీతభత్యాలు, ఉద్యోగ భద్రత, పింఛన్లు వంటి ఐదు ప్రధాన అంశాలపై తమిళిసై సందేహాలు లేవనెత్తారు. వాటికి సమాధానమిస్తూ సీఎస్ శాంతి కుమారి(CS Shanti Kumari) గవర్నర్‌కు వివరంగా లేఖ రాశారు. సీఎస్ సమాధానాలతో సంతృప్తి చెందని రాజ్‌భవన్ మరో 6 అంశాలను అదనంగా జోడిస్తూ.. సమాచారం కావాలని కోరారు. అయితే ఈ సారి కేంద్రం వాటా ఆర్టీసీలో 30 శాతం ఉందని పేర్కొనందున విలీనానికి కేంద్రం అనుమతి ఏమైనా తీసుకున్నారా అని.. తీసుకొని ఉంటే సంబంధిత కాపీని పంపాలని చెప్పారు. అలాగే ఆర్టీసీలోని శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల వివరాలను కూడా అడిగారు. ఈ విధంగా అడగడానికి గల కారణం.. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చేయడమే అని రాజ్‌భవన్(Raj Bhavan) వివరణ ఇచ్చింది.
శాశ్వత ఉద్యోగులు మినహా మిగిలిన వారి విషయంలో చట్టపరంగా ఏ విధమైన చర్యలు తీసుకున్నారని గవర్నర్(Governor) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్పొరేషన్‌కు సంబంధించిన చర, స్థిరాస్తులు అలాగే కొనసాగుతాయా లేదా చెప్పాలని.. అవి కొనసాగితే ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంటుందా అని అడిగారు. ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తే వారిని నియంత్రించే అధికారం ఎవరికి ఉంటుందని.. ఉద్యోగులను ప్రభుత్వంలో కలుపుకున్న తర్వాత వీరంతా కార్పొరేషన్లో డిప్యుటేషన్(Deputation in Corporation)పై పని చేస్తారా.. లేక వేరే ఏర్పాటు ఏమైనా ఉందా ఇలా పలు ప్రశ్నలను ప్రభుత్వానికి సంధించారు గవర్నర్. వీటన్నింటికీ రాష్ట్రప్రభుత్వం సరైన వివరణ ఇవ్వడంతో ఆర్టీసీ విలీన బిల్లు(TSRTC Merger Bill)పై గవర్నర్ నేడు ఆమోదముద్ర వేశారు.