ఏపీలో ప్రముఖ శక్తివంతమైన ఆలయం, రాష్ట్ర ప్రజల అమ్మలగన్నమ్మ విజయవాడ కనక దుర్గమ్మను తెలంగాణ గవర్నర్ తమిళసై(Tamilisai) ఇవాళ దర్శించుకున్నారు. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్(Hyderabad) నుంచి.. తొలుత ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో కలెక్టర్ రాజాబాబు, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఇంద్రకీలాద్రి(Indrakeeladri)కి చేరుకున్న గవర్నర్ తమిళసైకు దుర్గామల్లేశ్వరస్వామి దేవాలయం పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు(karnati Rambabu), ఈవో భ్రమరాంబ(EO bramarambha), వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ గర్భగుడికి చేరుకున్న గవర్నర్.. దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్బంగా గవర్నర్ తమిళిసై(Tamilisai) మాట్లాడుతూ.. బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.అమ్మవారి దర్శనం పూర్వ జన్మ సుకృతమని అన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజల్ని కనక దుర్గమ్మ చల్లగా చూడాలని కోరారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం తమిళసైకి పండితులు వేదాశీర్వచనం అందించారు. దేవస్థానం తరఫున అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని ఇచ్చారు. చంద్రయాన్- 3 విజయవంతమైనందుకు సంతోషంగా ఉందని, ఆదిత్య-ఎల్ 1 విజయవంతం కావాలని దుర్గమ్మను వేడుకున్నట్లు తమిళసై తెలిపారు.