ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ నియంత్రణలోని వివిధ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో రెగ్యులర్/కాంట్రాక్ట్ ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఏపీఎంఎస్‌ఆర్‌బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులన్నింటినీ ఎలాంటి రాత పరీక్ష లేకుండా వాక్-ఇన్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తోంది. మొత్తం 300 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయి. వీటన్నింటినీ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, గైనకాలజీ, అనస్థీషియా, ఈఎన్‌టీ,పాథాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, రేడియాలజీ, చెస్ట్ డిసీజ్ స్పెషలైజేషన్‌లలో భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ/డిప్లొమా/డీఎన్‌బీలో ఉత్తీర్ణత పొందిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయోపరిమితి జులై 01, 2023 నాటికి తప్పనిసరిగా 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సడలింపు ఉంటుంది.ఆసక్తి కలిగిన వారు సంబంధిత ధృవీకరణ పత్రాలతో కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూలకు నేరుగా హాజరుకావచ్చు. ఇంటర్వ్యూ నిర్వహించే తేదీలు సెప్టెంబర్ 5, 7, 9 తేదీల్లో ఉంటుంది. పీజీ, పీజీ డిప్లొమా, డీఎన్‌బీ సాధించిన మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి రెగ్యులర్ పోస్టులకు అయితే నెలకు రూ.61,960 నుంచి రూ.1,51,37 వరకు జీతంగా చెల్లిస్తారు. కాంట్రాక్ట్ పోస్టులకు గిరిజన ప్రాంతమైతే రూ.250000, గ్రామీణ ప్రాంతమైతే రూ.200000, పట్టణ ప్రాంతమైతే రూ.130000 వరకు జీతంగా చెల్లిస్తారు.