కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పలు రైళ్లను పునరుద్దించేందుకు సిద్ధం అయింది. అలాగే నూతన రైళ్లను ప్రారంభించేందుకు సన్నాహాకాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రైల్వే లైన్ల విస్తరణ పనులకు సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తొమ్మిది రాష్ట్రాల్లో ఏడు మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. గుంటూరు-బీబీనగర్ డబ్లింగ్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. దాదాపు రూ.3,238.38 కోట్ల అంచనా వ్యయంతో 272.69 కి.మీల మేర డబ్లింగ్ పనులు చేపట్టాలని నిర్ణయించింది. రైల్వే పనులు పూర్తి అయితే చుట్టుపక్కల ప్రజలకు రాకపోకలు సులువు అవుతాయి. అలాగే తక్కువ ధరతో ఎక్కువ ప్రయాణించవచ్చు.
అలాగే, రూ.5,655.4 కోట్ల అంచనా వ్యయంతో డోన్-మహబూబ్ నగర్; మేడ్చల్-ముద్ఖేడ్ (మొత్తంగా 502.34 కి.మీ) మధ్య డబ్లింగ్‌కు ఆమోదం తెలిపింది. నెర్గుండి- బారాంగ్; కుర్దా రోడ్ – విజయనగరం మధ్య (417.6 కి.మీలు) రూ.5,618.26 కోట్ల అంచనా వ్యయంతో మూడో లైన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దేశంలో రైల్వే లైన్ల విస్తరణ, రైళ్ల రాకపోకలను క్రమబద్ధీకరించడం, రద్దీని తగ్గించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్టు పేర్కొంది. మొత్తం రూ.32,500కోట్ల అంచనా వ్యయంతో ఉత్తరప్రదేశ్, బిహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 35 జిల్లాల పరిధిలో ప్రస్తుతమున్న రైల్వే నెట్‌వర్క్‌లను విస్తరించనున్నారు.
మరోవైపు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 2025 అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా రైల్వే అధికారులు ప్రణాళికలు రచించారు. రూ.700 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 13న లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పనుల నిమిత్తం రైల్వే స్టేషన్ ఎదుట తవ్వకాలు చేపట్టి స్థలాకృతి సర్వే చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ రాకేష్ తెలిపారు. ఈ సర్వే ఆధారంగానే రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న బుకింగ్ కౌంటర్‌ను కొత్త హంగులతో తీర్చిదిద్దుతున్నామన్నారు.
ఉత్తరం వైపు ఉన్న బైక్ పార్కింగ్ గేటు నెంబర్ 3ను సమీపంలోని ప్రత్యామ్నాయ ప్రదేశానికి మార్చామన్నారు. కొత్తగా రూపుదిద్దుకోనున్న రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్, కవర్ ఓవర్ షెల్టర్ పై కప్పు నమూనా ఖరారైందని వెల్లడించారు. 40 ఏళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.