పల్నాడులో భారీ స్కాం బయటపడింది. ఇంటి దొంగల చేతి వాటంతో దొడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ లో భారీగా బంగారం మాయమైంది. డబ్బు చెల్లించిన తర్వాత బంగారం ఇవ్వమంటే ఖాతాదారులకు బ్యాంక్ అధికారులు మొండి చేయి చూపిస్తున్నారు. బ్యాంక్ అప్రైజర్ నాగార్జున, మేనేజర్ మధుబాబు కలిసి తమ బంగారం మాయం చేశారని ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల డబ్బులు కట్టి, ఖాతాలు రెన్యువల్ చేసిన అనేక ఖాతాల్లో సిబ్బంది బంగారం మాయం చేసినట్లు ఖాతాదారులు చెబుతున్నారు. అంతేకాకుండా కొన్ని అకౌంట్లలో ఖాతాదారులకు తెలియకుండా అధిక మొత్తంలో లోన్లు తీసుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. బ్యాంక్ సిబ్బంది మొత్తాన్ని విచారించాలని.. బ్యాంకు ముందు వందల సంఖ్యలో ఖాతాదారులు ఆందోళనకు దిగారు.
మరోవైపు బంగారం మాయమైన వ్యవహారంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దోడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ లో.. డొడ్లేరుతో పాటు సమీపంలో ఉన్న ఐదు గ్రామాల ప్రజలకు ఆ బ్యాంక్ లో ఖాతాలు ఉన్నాయి. అయితే ఖాతాదారులు గత కొద్ది నెలలుగా బ్యాంకు అప్పు చెల్లించినప్పటికీ.. బ్యాంకు సిబ్బంది రసీదులు ఇవ్వలేదని చెబుతున్నారు. అంతేకాకుండా ఖాతాదారులకు తెలియకుండా ఖాతాల్లో పెద్ద మొత్తం లోన్ల రూపంలో డబ్బులు డ్రా చేశారని అంటున్నారు. దీంతో తమ ఖాతాల పేరుతో పెద్ద ఎత్తున లోన్లు ఉండటంతో బాధితులు లబోదిబోమని అంటున్నారు. అంతేకాకుండా మరికొన్ని అకౌంట్ లలో ఉన్న బంగారం నకిలీదని అనుమానిస్తున్నారు. ప్రతి 10 గ్రాములకు 5 గ్రాములు మాయమైనట్లు ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్య ధోరణితో బాధితులు ఆందోళనకు దిగారు. మరోవైపు బ్యాంకు ప్రధాన ద్వారం మూసేసి బ్యాంకు ఉన్నతాధికారులు లోపల తనిఖీలు చేస్తున్నారు. బ్యాంకులో ఇంత వ్యవహారం జరుగుతున్న మేనేజర్ కు తెలియకుండా జరుగుతుందా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.