హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం (Ganesh Nimajjanam) సందడిగా సాగుతోంది. గణనాథుడి శోభాయాత్రలతో నగరంలోని వీధులన్నీ కోలాహలంగా మారాయి. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ.. నృత్యాలు చేస్తూ వినాయకుడి విగ్రహాలను ఊరేగింపునకు తరలిస్తున్నారు. నృత్యాలతో యువత హోరెత్తిస్తున్నారు. గణపతి బప్పా మోరియా.. గణేశ్ మహారాజ్‌కి జై అంటూ.. విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. లంబోదరుడిని గంగమ్మ ఒడిలోకి చేర్చేందుకు తరలి వెలుతున్నారు. లక్షలాది సంఖ్యలో భక్తులు గణనాథుల శోభయాత్రను చూసేందుకు రావడంతో.. పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో కలిపి 40,000 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. నిమజ్జనోత్సవాన్ని పర్యవేక్షించడానికి బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు శోభాయాత్రలు సాగే దారుల్లో సాధారణ వాహనాల రాకపోకలకపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో వాహనాలు నిలిపేందుకు ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. ప్రజల సౌకర్యార్ధం టీఎస్ఆర్టీసీ 535 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. గణేష్ నిమజ్జనం వేళ అర్ధరాత్రి ఒంటి గంట వరకు రైళ్లు నడపనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది. గణనాథుడి శోభాయాత్రలతో నగరంలోని వీధులన్నీ కోలాహలంగా మారాయి.