దేశవ్యాప్తంగా చూసిన ఎదురు చూపులు ఫలించాయి. కోట్లాది మంది భారతీయులు సహా ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న చారిత్రక క్షణాలు మంచి జ్ఞాపకంగా మారాయి. భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధృవం సమీపంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. గంటల తరబడి ఉత్కంఠకు తెరదించుతూ మూన్ మిషన్ సక్సెస్ కావడంతో యావత్ దేశం సంబరాల్లో మునిగితేలుతున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లికి చెందిన కృష్ణ కుమ్మరి చంద్రయాన్-3 మిషన్‌లో 2 పేలోడ్స్ (ఏహచ్వీసీ), (ఐఎల్‌ఎస్‌ఏ)కి డేటా ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్ రాశారు. కూలి పనులు చేస్తూ జీవనం సాగించే ఉండవల్లికి చెందిన లక్ష్మీదేవి, మద్దిలేటి దంపతులకు ఇద్దరు సంతానం. అబ్బాయి కృష్ణ కుమ్మరి, అమ్మాయి శకుంతల. కృష్ణ విద్యాభ్యాసం 1 నుంచి 10 వరకు ఉండవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొనసాగింది. 10వ తరగతి 2008 పూర్తి చేసి.. మూడేళ్లు తిరుపతిలో డీసీఎస్ఈ(డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్) చేశాడు. ఈ-సెట్ పరీక్ష రాసి హైదరాబాద్ 2011-2014లో సీఎస్‌ఈ చేశారు. కళాశాల ప్లెస్‌మెంట్‌లో భాగంగా టెరా డేటా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో మూడున్నర సంవత్సరాలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు.
ఉద్యోగం చేస్తూనే ఇస్రోలో ఐసీఆర్‌బీ రాసి ఆల్ ఇండియా స్థాయిలో 4వ ర్యాంకు సాధించారు. అనంతరం 2018 జనవరిలో సైంటిస్ట్ లెవల్ ఉద్యోగం (గ్రూప్ ‘ఏ’ గెజిడెట్ అధికారి) యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (URSC)/ఇస్రోలో ఓ యూనిట్ ల్యాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్ (ఎల్‌ఈఓఎస్) బెంగళూరులో సాధించారు. చంద్రయాన్-3కి అనేక కేంద్రాలు పనిచేశాయి. మిషన్‌లోని 2 పేలోడ్స్‌లో 5 మంది సభ్యులు పనిచేసినా.. వీటిలో ఎల్‌హెచ్‌వీసీ, ఐఎల్‌ఎస్‌ఏకు కృష్ణ కుమ్మరి డేటా ప్రాసెసింగ్ అనాలసిస్ సాఫ్ట్‌వేర్ రాసినట్లు చెప్పారు. ఎల్‌హెచ్‌వీసీ అంటే హారిజాంటల్ వెలాసిటీని చెబుతుందని, ఐఎల్‌ఎస్‌ఏ అంటే చంద్రుడి()పై వచ్చే కంపనాలు గుర్తించి రికార్డు చేస్తుందని కృష్ట వివిరించారు. ఈ సాఫ్ట్‌వేర్ పేలోడ్స్ నుంచి వచ్చే డేటాని ఐఎస్‌టీఆర్‌ఏసీ, బెంగళూరు అందుకుంటుందన్నారు. చంద్రయాన్-3 మిషన్‌కు తాను 6 నెలల పాటు పని చేసినట్లు తెలిపారు. చంద్రయాన్-3 మిషన్ 100 శాతం విజయవంతం అవుతుందని ఆశిస్తున్నానని స్పష్టం చేశారు.