ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ నుంచి రేడియోధార్మిక వ్యర్ధాలనువిడుదల చేసేందుకు జపాన్ సిద్దమయింది. పసిఫిక్ మహాసముద్రంలోకి గురువారం ఆ జలాలను రిలీజ్ చేయనున్నారు. అయితే 12 ఏళ్ల క్రితం ఆ ప్లాంట్‌లో ఉన్న రియాక్టర్ కరిగిపోయింది. దీంతో మంగళవారం క్యాబినెట్ ఓ నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలో ప్రధాని ఫుమియో కిషిదా ఆ విషయాన్ని ప్రకటించారు. రేడియో ధార్మిక వ్యర్ధ జలాలను సముద్రంలోకి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉండాలని.. దాని ఆపరేటర్ టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీకి ఆదేశాలను కూడా జారీ చేశారు. వాతావరణం, సముద్ర పరిస్థితులు అనుకూలిస్తే జలాల విడుదల జరుగుతుందన్నారు. ప్లాంట్ డీకమిషనింగ్ కోసం రేడియోధార్మిక వ్యర్థ జలాల విడుదల అవసరమని కిషిదా తెలిపారు. ప్లాంట్ భద్రత కోసం అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. మత్స్య పరిశ్రమ ప్రతిష్ట దెబ్బతినకుండా చూస్తామన్నారు. డీకమిషనింగ్ ప్రక్రియ కొన్నేళ్ల పాటు సాగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
భారీ భూకంపం, సునామీ వల్ల ఫుకుషిమాలో ఉన్న కూలింగ్ రియాక్టర్లు ధ్వంసం అయ్యాయి. దాంతో ఆ ప్లాంట్ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే వ్యర్థ జలాలను సముద్రంలోకి రిలీజ్ చేయవద్దు అని చాన్నాళ్లు ఫిషింగ్ ఇండస్ట్రీలు వ్యతిరేకించాయి. సుమారు పది లక్షల టన్నుల ట్రీట్మెంట్ చేసిన రేడియోధార్మిక వ్యర్ధ జలాలను సముద్రంలోకి రిలీజ్ చేయనున్నారు. అయితే ఆ నీరు సురక్షితంగానే ఉన్నట్లు జపాన్ ప్రభుత్వం చెబుతోంది. ఆ నీటి వల్ల ప్రభావం తక్కువే అని, అందుకే అనుమతి ఇస్తున్నట్లు అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది.