మంగళగిరి పరిధిలోని ఎన్ఆర్ఐ వైద్య కళాశాలలో నాలుగో సంవత్సరం వైద్య విద్యార్థి కామేపల్లి వెంకట ప్రణవ్ యశ్వంత్ ఆత్మహత్య వెనుక కళాశాల యాజమాన్యం ఫీజుల కోసం చేసిన వేధింపులు ఉన్నట్లు సమాచారం. కళాశాల నిర్దేశించిన ఫీజు చెల్లించినప్పటికీ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి మండవ విష్ణువర్ధన్ రావు అదనంగా ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేయటంతోనే యశ్వంత్ నిన్న (మంగళవారం) ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. తనకు యాజమాన్యం నుంచి ఎదురౌతున్న అదనపు ఫీజు చెల్లింపు వేధింపుల గురుంచి రెండు నెల్ల క్రితమే యశ్వంత్ విజయవాడలోని ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయం అధికారులతో పాటు, ఎన్ఆర్ఐ కళాశాల అధికారులకు లేఖ రాసినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలనే కఠిన నిర్ణయాన్ని యశ్వత్ తీసుకున్నారని సమాచారం. కళాశాల యాజమాన్యం ఫీజు వేధింపుల గురించి విశ్వవిద్యాలయ అధికారులకు చేసిన ఫిర్యాదు కాపీ యశ్వంత్ సూసైడ్ అనంతరం వెలుగులోకి వచ్చింది.
2019లో ఎన్ఆర్ఐ కాలేజీలో వైద్య విద్య చదివేందుకు మేనెజ్మెంట్ కోటాలో యశ్వంత్ చేరినప్పటి నుంచి ప్రతి సంవత్సరం నిర్దేశించిన గడువులోగా.. ముందుగా నిర్ణయించిన రూ. 33 లక్షల ఫీజు చెల్లిస్తున్నట్లు లేఖలో అతడు పేర్కొన్నారు. ఈ ఏడాదికి సంబందించిన ఫీజు 33 లక్షల రూపాయలు ఏప్రిల్ 12వ తేదీన చెల్లించినట్లు లేఖలో పేర్కొన్నారు. అయితే కళాశాల అధికారులు అదనంగా మరో 12 లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేశారని లేఖలో యశ్వంత్ రాసుకొచ్చాడు. ఈ మొత్తం చెల్లిస్తే ఫీజు ఏడాదికి 37 లక్షలు అవుతుందని.. తానూ అంత మొత్తం చెల్లించలేనని నిస్సహాయత వ్యక్తం చేస్తూ ప్రిన్సిపాల్ కు తెలియచేశానని లేఖలో సదరు స్టూడెంట్ పేర్కొన్నారు.
ఇప్పటికే మొత్తం ఫీజు చెల్లించానని ఇక అదనపు చెల్లింపు తనవల్ల కాదని చెప్పినా వినకుండా ప్రిన్సిపాల్ తోటి విద్యార్థుల ముందు నన్ను అవమానించే విధంగా అవహేళన చేశారని యశ్వంత్ లేఖలో తెలిపారు. ఫీజు విషయమై కళాశాల అడ్మినిస్ట్రేటర్ తో మాట్లాడాల్సిందిగా ప్రిన్సిపాల్ చెప్పారని, అదే టైంలో అడ్మినిస్ట్రేటర్ ఆదేశాలతో తనపై చర్యలకు ప్రిన్సిపల్ ఉపక్రమించారని తెలిపాడు. ఫీజు మొత్తం చెల్లించిన తనపై ప్రిన్సిపల్ చర్యలు తీసుకోకుండా చూడాలని అభ్యర్ధించేందుకు అడ్మినిస్ట్రేటర్ ఎంవీ రావును కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదని ఈ లేఖలో యశ్వంత్ తన ఆవేదనను విశ్వవిద్యాలయ అధికారులకు తెలిపారు.
తనపై కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు కళాశాల యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతోందని, తానూ శ్రద్ధతో చదువుకోనివ్వకుండా మానసికంగా వేధిస్తూ తన భవిష్యత్తును సరిద్దిదుకోలేని విధంగా నష్టం చేస్తున్నా.. ఎన్ఆర్ఐ కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో శ్వంత్ విశ్వవిద్యాలయ అధికారులను కోరారు. తనను వేధించకుండా, తనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఉండేలా ఎన్ఆర్ఐ వైద్య కళాశాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ లేఖలో అభ్యర్ధించారు. ఈ లేఖ ప్రతిని యశ్వంత్ విశ్వవిద్యాలయ అధికారులతో పాటు, కళాశాల అడ్మినిస్ట్రేటర్, ప్రిన్సిపల్ కు ఈ ఏడాది జూన్ 23న పంపించారు. వారి నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవటంతో యశ్వంత్ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారని సన్నిహితులు చెబుతున్నారు.