రంగారెడ్డి జిల్లా మెడికల్ విద్యార్థులకు వైద్యారోగ్య శాఖా మంత్రి మంత్రి హరీశ్‌రావు గుడ్ న్యూస్ చెప్పారు. మరో వారం పదిరోజుల్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అలాగే దీనికి అనుబంధంగా 550 పడకలతో ఆస్పత్రి నిర్మాణం కూడా ఉంటుందని వివరించారు. ఈ ఆసుపత్రి నిర్మాణంతో నియోజకవర్గ ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం తప్పుతుందని అన్నారు. జిల్లాలోని వివిధ అభివృద్ధి పనులు ప్రారంభించిన హరీశ్ రావు.. మహేశ్వరంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు.
హరీష్ రావు మాట్లాడుతూ.. ఎదిగిన నాయకురాలుంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సబితా ఇంద్రారెడ్డి కోరగానే ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గానికి మెడికల్ కళాశాల మంజూరు చేశారని గుర్తుచేశారు. విద్య, వైద్య రంగంలో ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. భారతదేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని.. చెరువుల అభివృద్ధిలో కర్ణాటక.. తెలంగాణను కాపీ కొడుతోందని హరీశ్‌రావు వెల్లడించారు.
తెలంగాణ ఆచరిస్తది.. దేశం అనుసరిస్తది అనేలా కేసీఆర్ చేశారన్నారు. అలాగే రైతులకు ఉచిత కరెంటుపై అసత్యాలు పలుకుతున్న కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. మూడు గంటల కరెంట్ కావాలాంటే కాంగ్రెస్‌కే ఓటు వేయాలని.. అదే 24 గంటలు కరెంట్ కావాలనుకుంటే మాత్రం కేసీఆర్‌కు మాత్రమే ఓటు వేయాలని సూచించారు. కిషన్ రెడ్డి దత్తత తీసుకున్న తిమ్మాపూర్‌లో రూపాయి పని చేయలేదన్నారు. మీటర్లు పెట్టలేదని కేంద్రం రూ.35వేల కోట్లను నిలిపివేసిందని విమర్శించారు. నాడు తెలంగాణలో మూడు మెడికల్ కళాశాలలే ఉండేవి.. కానీ ఇప్పుడు 33 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
24 గంటల కరెంట్ కోసం కేసీఆర్ మ్యాజిక్ చేయలేదు.. మంత్రం వేయలేదు.. కేసీఆర్ కష్టపడటం వల్లే రైతులకు పూర్తిస్థాయిలో కరెంట్ అందుతోందని హర్షించారు. రంగారెడ్డి జిల్లాలో 95 వేలు మంది మహిళలకు వడ్డీతో సహా అభయహస్తం డబ్బులు వారం రోజుల్లోగా ఖాతాల్లో పడతాయని హామీ ఇచ్చారు. మహిళల వడ్డీలేని రుణాలు దశల వారీగా విడుదల చేస్తామని తెలిపారు. పేదలు, మహిళల పక్షాన ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని వివరించారు.