ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో వరదలు సంభవించి జనజీవనం అస్తవ్యస్తమయింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఢిల్లీలో యమునా నది 45 ఏళ్ల గరిష్టస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. యమునా నది లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఇప్పటికే సీఎం అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరికలు జారీ చేశారు. హరియానాలో కూడా గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద పరిస్థితులు తలెత్తాయి. రాష్ట్ర మంత్రి నివాసంలోనూ వరద నీరు చేరింది.
అంబాలాలో హరియాణా హోంమంత్రి అనిల్ విజ్ నివాసంలోకి భారీగా వరద నీరు వచ్చింది. అనిల్ ఇంటి ముందు మోకాలిలోతు నీరు చేరిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అంబాలాలోని అనేక ప్రాంతాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ అనిల్ విజ్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి విధి నిర్వహణ చేపట్టారు. బోటులో నగరమంతా తిరిగి పరిస్థితులను పర్యవేక్షించారు. వరద ముప్పు నుంచి ప్రజలను రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే హర్యానాలో భారీ వర్షాల కారణంగా 10 మంది మరణించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. అవసరమైతే తప్పా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మృతుల కుటుంబాలకు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ పరిహారాన్ని ప్రకటించారు.