డేనియల్ తుపాను ఆఫ్రికా దేశం లిబియా (Libya)లో సృష్టించిన జల విలయం (Floods) పెను విషాదాన్ని మిగిల్చింది. భారీ ప్రకృతి విలయం ధాటికి వేల మంది కొట్టుకుపోగా.. ఇప్పుడు ఆ మృతదేహాలు(Dead Bodies) తీరానికి కొట్టుకొస్తున్నాయి. ఈ ప్రళయంలో మొత్తంగా 20వేల మంది వరకు మృతిచెంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దొరికిన మృతదేహాల సంఖ్య 5 వేలు దాటింది. వరదల ధాటికి రెండు డ్యామ్‌లు కొట్టుకుపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. వరద కారణంగా వేల సంఖ్యలో ఇళ్లు తుడిచి పెట్టుకుపోయాయి. దీంతో ఎటు చూసినా శవాల దిబ్బలే కన్పిస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు లిబియాలో డెర్నా (Derna) నగరంలో వీధుల్లో మృతదేహాలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఇక ఈ వరద వేలాది మందిని సనిముద్రంలోకి ఈడ్చుకెళ్లింది. ఇప్పుడా మృతదేహాలు తిరిగి తీరానికి కొట్టుకొస్తున్నాయని స్థానిక మంత్రి ఒకరు తెలిపారు. దీంతో సముద్ర తీరం శవాల కుప్పగా మారింది.
ఇప్పటికే ఈ విపత్తులో 5,300లకు పైగా మృతదేహాలను(Dead bodies) అధికారులు గుర్తించారు. వీరిలో కొందరు విదేశీయులు కూడా ఉన్నారు. మొత్తంగా ఈ ప్రళయంలో 18వేల నుంచి 20వేల వరకు మృతి చెంది ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు డెర్నా మేయర్ అబ్దుల్‌మేనమ్ అల్ ఘైతి మీడియాకు తెలిపారు. డెర్నాలో మృతదేహాలను భద్రపరిచే పరిస్థితి లేకపోవడంతో ఇతర నగరాల్లోని మార్చురీలకు తరలిస్తున్నారు. వందల సంఖ్యలో వస్తున్న మృతదేహాలను సామూహిక ఖననం చేస్తున్నారు. మరోవైపు వరద తీవ్రత ఎక్కువగా ఉన్న డెర్నా నగరంలో సహాయక చర్యలు చేపట్టేందుకు తుర్కియే, యూఏఈ, ఈజిప్టు, ట్యునీషియా, ఖతార్ నుంచి సహాయక బృందాలు చేరుకున్నాయి. అయితే వరద కారణంగా రహదారులు కొట్టుకుపోవడంతో ఈ సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇక, రోజుల తరబడి నీటిలో మృతదేహాలు ఉండటంతో అంటు వ్యాధుల ప్రబలే ముప్పు పొంచి ఉందని డెర్నా మేయర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జలప్రళయం ధాటికి విలవిల్లాడిన డెర్నాలో చాలా కట్టడాలు 20వ శతాబ్దం మొదట్లో నిర్మించినవి కావడం గమనార్హం. అప్పట్లో అవి పర్యాటకంగా ఆకట్టుకునేవి కూడా. అయితే, గడాఫీ ప్రభుత్వం కూలిన తర్వాత ఆ ప్రాంతం అతివాద గ్రూపులకు కేంద్రంగా మారింది. దాంతో గతంలో ఈజిప్టు అక్కడ వైమానిక దాడులు నిర్వహించింది. ఆ తర్వాత హిఫ్తార్ బలగాలు దానిని స్వాధీనం చేసుకున్నాయి. 2011 తర్వాత అక్కడ పెద్దగా మౌలిక నిర్మాణాల కల్పన జరగలేదు. దెబ్బతిన్న డ్యామ్ ఒకదాన్ని 1970ల్లో నిర్మించారు. నేతల నిర్లక్ష్య వైఖరితో పెనునష్టం సంభవించినట్టు ఆరోపణలు వస్తున్నాయి.