కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ బీఆర్ఎస్ నేతలు చెబుతున్నవన్ని అసత్యాలే అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP leader Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు. ఈక్రమంలోనే మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు ఎమ్మెల్సీ కవితపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ముగ్గురికి తన సొంత డబ్బులతో ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తానని.. తనతో కర్ణాటక వస్తే అసలు విషయం తెలుస్తుందని పేర్కొన్నారు. విమానంలో కాకపోతే బస్సులో వస్తానన్నా.. బస్సుు టికెట్లు బుక్ చేస్తానని తెలిపారు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ(Congress party) అక్కడ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందని వివరించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్(Chief Minister KCR) లాగా తప్పుడు ప్రచారం చేయడం లేదని, నిలబెట్టుకోలేని హామీలు కూడా ఇవ్వడం లేదని చెప్పారు. బడ్జెట్ అంచనా వేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తోందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi)లౌకిక వాది అని.. దేశాన్ని ఏకం చేయాలనే ఉద్దేశంతోనే పాదయాత్ర చేశాడని వివరించారు. అలాగే ఎంఐఎం ఎంపీ అసదుద్దిన్ ఒవైసీపై కూడా భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే బీజేపీకి సపోర్ట్ చేయడమేనంటూ తెలిపారు. నిజంగా నీవు సెక్యులర్ నాయకుడివే అయితే రాహుల్ గాంధీకి సపోర్ట్ చేయాలని సూచించారు.
ఇందిరా భవన్ లో వార్ రూమ్, కనెక్ట్ సెంటర్ ను ఏఐసీసీ ఇంఛార్జ్ మానిక్ రావు ఠాక్రే(AICC in-charge Manik Rao Thackeray), సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ.. సోనియా గాంధీ(Sonia Gandhi) ఇచ్చిన ఆరు హామీలను.. అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేరుస్తామని చెప్పుకొచ్చారు. ప్రతీ మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని, 500 రూపాయలకే గ్యాస్ ఇస్తామని తెలిపారు. అలాగే రైతుకు క్వింటాలుకు 500 బోనల్ ఇస్తామని, పేదలకు ఇంటి స్థలం, ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఐదు లక్షల హామీ విద్యార్థులకు ఇస్తామని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే ప్రతీ ఇంటికి గ్యారంటీ కార్డు ఇస్తామని… ఈ కార్డులో ఇంటి స్థలం ఉంటుంది అన్నారు.