కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా.. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘చంద్రముఖి 2’. పీ వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు స్వరకర్త. వినాయక చవితి పండగ సీజన్‌లో చంద్రముఖి 2 సినిమా పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవల చంద్రముఖి 2 మూవీ నుంచి రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంది. నేడు బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో కంగనా పట్టు శారీ కట్టుకుని, నగలు పెట్టుకుని అందంగా ఉన్నారు. ఓ గదిలో దేన్నో తీక్షణంగా చూస్తూ నిలబడ్డారు. పోస్టర్‌లో కంగనా భయపెట్టే మాదిరి అయితే లేదు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చంద్రముఖి 2లో సీనియర్ కమెడియన్ వడివేలు కీలక పాత్రలో నటిస్తున్నాడు. మహిమా నంబియార్, లక్ష్మీ మీనన్, సిరుష్టి డాంగే, రావు రమేష్, విఘ్నేష్, రవి మారియా, సురేష్ మీనన్, సుభిక్షా కృష్ణన్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా సెప్టెంబరు 15న విడుదల కానుంది. 18 ఏళ్ల ముందు సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు, వడివేలు ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమాకు ఇది సీక్వెల్.