హైదరాబాద్ హబ్సీగూడలో అగ్నిప్రమాదం సంభవించింది. అన్‌లిమిటెడ్ షోరూం నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. షాపింగ్ కాంప్లెక్స్‌లోని 2, 3వ అంతస్తుల్లోని హబ్సిగూడ అన్ లిమిటెడ్ షోరూంలో మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత మంటలు చెలరేగాయి. ముందుగా రెండో అంతస్తులోని టేస్ట్ అఫ్ ఇండియా హోటల్ లో చెలరేగిన మంటలు.. మొదటి అంతస్తులోని అన్‌లిమిటెడ్ షోరూంలోకి కూడా వ్యాపించాయి. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ముందుగా మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ మంటలు అదుపులోకి రాలేదు. దీంతో 10 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం 6గంటల సమయంలో జరిగిన అగ్ని ప్రమాదం సంభవించిన ఇప్పటికి మంటలు అదుపులోకి రాకపోడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనం పక్కనే పెట్రోలు బంక్ ఉండటంతో ముందు జాగ్రత్తగా పోలీసులు దాన్ని మూసేయించారు. అయితే మంటలు ఆర్పినప్పటికీ.. ఆ భవనంలో నుంచి దట్టంగా పొగలు వ్యాపిస్తున్నాయి. దీంతో ఉప్పల్ – సికింద్రాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అగ్నిప్రమాదం జరిగిన దుకాణాల నుంచి జీహెచ్‌ఎంసీ అద్దాలు తొలగిస్తున్నారు. ఇప్పటికే ఆ షో రూమ్ లో చిక్కుకున్న ఇద్దరినీ అగ్ని మాపక సిబ్బంది సురక్షితంగా రక్షించింది. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదిలావుంటే హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. అత్తాపూర్ హసన్ నగర్‌లో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ బట్టల గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. రెండు ఫ్లోర్లలో మంటలు వ్యాపించడంతో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. మంటలు ఎగిసిపడుతుండటంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. చుట్టుపక్కల ఇళ్లకు మంటలు వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.