ఏపీ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ తప్పి.. లెక్కకు మించి అప్పులు చేస్తోందని ఆరోపించారు. గవర్నర్ నజీరన్ను బీజేపీ నేతలతో కలిసిన ఆమె.. పంచాయతీ నిధుల మళ్లింపు, అప్పులపై ఫిర్యాదు చేశారు. ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించారని . రూ.7600 కోట్ల నిధులు రాకపోవడంతో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. సర్పంచ్ కు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. గ్రామాలను అభివృద్ధి చేస్తామని వైసీపీ హామీ ఇచ్చిందని.. వాగ్దానాలు అమలు చేయకుండా సీఎం జగన్ మోసం చేశారని మండిపడ్డారు. కేంద్రం పంచాయతీలకు ఇచ్చిన నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. గ్రామాల్లో ప్రభుత్వం పనులు నిలిపివేశారని అన్నారు.
చిన్న చిన్న కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించలేని పరిస్థితి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కొంతమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ అంశంపై రాష్ట్ర గవర్నర్‌ను కలిసి పరిస్థితి వివరించాం. సర్పంచులకు న్యాయం చేయాలని, గ్రామీణ వ్యవస్థను కాపాడాలని కోరాం. రాష్ట్రంపై ఉన్న అప్పుల భారంపై పదేపదే బీజేపీ ప్రస్తావిస్తూ ఉంది. గడిచిన 4 సంవత్సరాల కాలంలో 7.44 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చారు. ఎఫ్ఆర్బీఎంకు లోబడి తీసుకొచ్చిన అప్పు కొంతవరకు ఉంటే ఆ పరిధిలోకి రానివ్వకుండా అనేక విధాలుగా వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అప్పులు తెచ్చింది.” అని దగ్గుబాటి పురంధరేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.