స్పెయిన్ మహిళల ఫుట్‌బాల్ హాకీ జట్టు సంచలనం సృష్టించింది. తొలిసారి ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 0-1 తేడాతో గెలిచి మొట్టమొదటి ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. స్పెయిన్ తరఫున ఏకైక గోల్ చేసిన ఓల్గా కార్మోనా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. టోర్నీలో స్పెయిన్ ఆరంభం నుంచి అదిరే ఆటతో అలరించింది. గ్రూపు-సిలో రెండో స్థానంతో నాకౌట్ రౌండ్‌కు అర్హత సాధించిన స్పెయిన్.. క్వార్టర్ ఫైనల్‌లో గత ఎడిషన్ రన్నరప్ నెదర్లాండ్స్‌ను, సెమీస్‌లో వరల్డ్ నం.3 స్వీడెన్‌ను చిత్తు చేసి ఫైనల్‌లో అడుగుపెట్టింది. టైటిల్ పోరులోనూ స్పెయిన్ జట్టు సత్తాచాటింది. బంతిని ఎక్కువ సమయం ఆధీనంలో ఉంచుకుంది. స్పెయిన్ 14 సార్లు గోల్ ప్రయత్నాలు చేయగా.. ఇంగ్లాండ్ 7 సార్లు మాత్రమే ప్రత్యర్థి గోల్ పోస్టుపై దాడి చేసింది. 29వ నిమిషంలో ఓల్గా కార్మోనా గోల్ చేసి స్పెయిన్ ఖాతా తెరిచింది.
మరోవైపు స్పెయిన్ డిఫెన్స్ టీమ్ మాత్రం ఇంగ్లాండ్‌కు గోల్ చేసే అవకాశాలను ఇవ్వలేదు. గోల్‌పోస్టు వద్ద ఇంగ్లాండ్ చేసిన మూడు ప్రయత్నాలను స్పెయిన్ గోల్‌కీపర్ కాటా కోల్ అడ్డుకుంది. అదనపు సమయంలోనూ ఇంగ్లాండ్ స్కోరును సమం చేయలేకపోయింది. దాంతో చివరి వరకూ ఏకైక గోల్‌తో ఆధిక్యాన్ని కాపాడుకున్న స్పెయిన్ విశ్వవిజేతగా నిలిచింది. దీంతో తొలిసారి వరల్డ్ కప్ చాంపియన్‌గా నిలవడంతో మైదానంలో స్పెయిన్ మహిళల సంబరాలు అంబరాన్నంటాయి. అటు తొలిసారి ఫైనల్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్‌కు నిరాశ తప్పలేదు. జపాన్‌కు చెందిన హినాటా మియాజావా ప్రపంచకప్‌లో ఐదు గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచి గోల్డెన్ బూట్ అవార్డు అందుకుంది. స్పెయిన్ క్రీడాకారిణి ఐటానా బొన్మతీ గోల్డెన్ బాల్ అవార్డు అందుకోగా.. ఇంగ్లాండ్ గోల్‌కీపర్ మేరీకి ఇయర్ప్స్ గోల్డెన్ గ్లవ్ అవార్డు దక్కింది.
ఈ ఏడాది ఫిఫా మహిళల వరల్డ్ కప్ టోర్నీకి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. ఈ టోర్నీలో మొత్తం 32 జట్లు పాల్గొన్నాయి. స్వీడన్, ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు సెమీస్ లోనే వెనుదిరిగాయి. వర్గీకరణ మ్యాచ్ లో నెగ్గిన స్వీడన్ కు 3వ స్థానం లభించగా, ఆస్ట్రేలియాకు 4వ స్థానం దక్కింది. విజేతగా నిలిచిన స్పెయిన్ అమ్మాయిల జట్టుకు రూ.35 కోట్ల ప్రైజ్ మనీ లభించనుంది. రన్నరప్ గా సరిపెట్టుకున్న ఇంగ్లండ్ రూ.25 కోట్ల ప్రైజ్ మనీ అందుకోనుంది.