వరంగల్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్ సిటీ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించగా.. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య ఆరుకు చేరింది.
గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన ఘటన ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద బాధితులంతా తేనె విక్రయించే కూలీలుగా తమ ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపడమే ప్రమాదానికి కారణంగా స్థానికుల ద్వారా తెలిసిందని చెప్పారు.