మహాదేవుడిని దర్శించుకునేందుకు వెళ్లిన యాత్రికుల బస్సుల ఘోర ప్రమాదానికి గురైంది. ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర కాశీ జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృత్యువాతపడగా.. 27మందికి తీవ్ర గాయాలయ్యాయి. 35మంది ప్రయాణికులతో బస్సు గంగోత్రి నుంచి వస్తుండగా గంగనమి వద్ద ఈ ఘోరం చోటుచేసుకున్నట్టు అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఈ బస్సులో ప్రయాణిస్తున్న వారంతా గుజరాత్‌కు చెందినవారిగా గుర్తించారు. ఉత్తరాఖండ్‌లో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకారణంగా అనేక చోట్ల కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించాయి.
ఈ దుర్ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన సహాయక చర్యలు త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర, జాతీయ విపత్తు స్పందన దళాలు, వైద్య సిబ్బంది ప్రస్తుతం అక్కడే ఉన్నట్టు వివరించారు. సహాయక చర్యల కోసం అవసరం ఉంటుందన్న ఉద్దేశంతో ముందుగానే ఓ హెలికాప్టర్‌ను సైతం సిద్ధం చేసి ఉంచామని తెలిపారు.