దేశంలో ఎక్కడో ఓ చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజగా యూపీ లో మరోఘటన జరిగింది. ప్రమాదవశాత్తు ఓ ట్రాక్టర్ నదిలో పడిపోయిన ఘటనలో నలుగురు చిన్నారులు, ఓ మహిళతో సహా.. మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహరాన్‌పుర్ జిల్లాలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు ట్రాక్టర్లో 50 మంది భక్తులు ఉన్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెహత్ పరిధిలోని రండోల్ గ్రామంలో ఉన్న జహర్‌వీర్ గోగా జీకి.. పూజలు చేసేందుకు బాధితులంతా ట్రాక్టర్లో వెళ్తున్నారు. వీరంతా గగల్‌హెడి పోలీస్ స్టేషన్ పరిధిలోని బలేలి గ్రామానికి చెందినవారు.
రెడ్డిబోడ్కి గ్రామ సమీపంలోని ధమోలా నదిలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పడిపోయింది. బాధితుల కేకలు విన్న స్థానికులు.. వెంటనే అక్కడికి చేరుకుని పలువురిని కాపాడారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టి మరికొందరిని కాపాడారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వారి మృతదేహాలను బయటకు తీశారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.