స్కూల్స్ నుంచి కాలేజీలకు మారే సమయంలో ప్రతి విద్యార్థి కేరీర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు ఉండే కోర్సులను ఎంచుకోవడం అత్యవసరం. ఇలా ఫ్యూచర్ డిమాండ్ ఉండే కోర్సుల్లో ఒకటిగా నిలుస్తుంది ఫ్యాషన్ డిజైనింగ్. నవతరం జీవన శైలిలో ఫ్యాషన్ ఓ భాగంగా మారడంతో అన్ని వయసుల వారు ఫ్యాషన్ పట్ల మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ యువత ఫ్యాషన్ కోర్సుల పట్ల మక్కువ చూపుతున్నారు. సాఫ్ట్ వేర్ టెక్నాలజీ ఎంత దూసుకుపోతుందో ఫ్యాషన్ రంగం కూడా అదే స్థాయిలో అంతే వేగంగా పుంజుకుంటుంది.
కోర్సుల వివరాలు:
ఫ్యాషన్ డిజైనింగ్ లో డిప్లొమా, బ్యాచలర్ డిగ్రీ స్థాయిలో అనేక ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు ఫ్యాషన్ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతాయి. వాటిలో ఫ్యాషన్ అండ్ అప్పెరల్ డిజైనింగ్, ఫ్యాషన్ బిజినెస్ అండ్ రిటైల్ మేనేజ్‌మెంట్, లైఫ్ స్టైల్ అండ్ యాక్సరీస్ డిజైన్, టెక్స్‌టైల్ డిజైన్, లెదర్ డిజైన్ వంటి మొదలైన ఫ్యాషన్ రంగానికి సంబంధించిన కోర్సులను తమ వ్యక్తిగత ఆసక్తిని బట్టి నేర్చుకోవచ్చు.
కోర్సుల వ్యవధి ఎంతంటే?
ఈ కోర్సులు 3 నుంచి 4 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. కొన్ని సమయాల్లో ఇన్‌స్టిట్యూట్స్ అభ్యర్థులను ఎంపిక చేయడానికి పోటీ పరీక్షలను సైతం నిర్వహిస్తుంటాయి. షార్ట్‌టర్మ్ కోర్సులపై ఆసక్తి ఉన్నవారు, డిప్లొమాలు, సర్టిఫికేట్ కోర్సుల ద్వారా కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేయవచ్చు. అయితే వీటితో ఉద్యోగ అవకాశాలు, ప్లేస్‌మెంట్స్ తక్కువగా ఉంటాయి. యూజీ స్థాయిలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే యువత ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
కెరీర్ ఆప్షన్స్
ఈ రంగంలోని వారికీ కేరీర్ అవకాశాలు చాలానే ఉంటాయి. క్రియేటివ్ డైరెక్టర్, ఫ్యాషన్ డిజైనర్, ఫ్యాషన్ స్టైలిస్ట్, గ్రాఫిక్ డిజైనర్, పర్సనల్ స్టైలిస్ట్, పబ్లిక్ రిలేషన్స్, ట్రెండ్ ఫోర్‌కాస్టర్, ఫ్యాషన్ జర్నలిస్ట్, ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ వంటి జాబ్ రోల్స్‌లో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కోర్సును బట్టి నిబంధనలు వేర్వేవేరుగా ఉంటాయి. సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారు కూడా ఈ కోర్సును పూర్తి చేసి ఫ్యాషన్ స్టూడియోస్ ఏర్పాటు చేసుకోవచ్చు. బోటిక్, డిపార్ట్‌మెంటల్ స్టోర్ లేదా లైఫ్‌స్టైల్, జరా, ఎంపోరియో అర్మానీ వంటి పెద్ద బ్రాండ్‌లలో కూడా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. వీటిలో వార్షిక ఆదాయం రూ.6లక్షల నుంచి మొదలువుతుంది. అయితే అభ్యర్థి యొక్క స్కిల్ ను బట్టి ఈ వార్షిక ప్యాకేజీలో మార్పులు ఉంటాయి.
నేర్చుకునే అంశాలు
ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో జాయిన్ అయిన విద్యార్థులు గార్మెంట్ కన్‌స్ట్రక్షన్, ప్యాట్రన్ మేకింగ్, డ్రేపింగ్, సర్ఫేస్ ఆర్నమెంటేషన్, ఫ్యాబ్రిక్స్, థ్రెడ్స్, కంప్యూటర్ ఎయిడెడ్ సాఫ్ట్‌వేర్, గ్రాఫిక్ డిజైన్ వంటి అంశాలకు సంబంధించిన వర్క్‌ను నేర్చుకుంటారు. అస్థెటిక్ గార్మెంట్స్, యాక్సెసరీస్ డిమాండ్ సప్లై నిరంతరం మారుతూ ఉంటుంది. కాబట్టి ఫ్యాషన్ క్యాపిటల్‌లో ట్రెండ్స్, సీజన్స్, డ్రెస్సింగ్, హై డ్రెస్సింగ్ విలువలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తుండాలి. ఈ పరిశ్రమలో నిపుణులకు డిమాండ్ బాగా ఉంటుంది. ఫ్యాషన్ నిపుణుల వీడియోలు, ఫ్యాషన్ డిజైనర్ల ఇంటర్వ్యూలు, ఫ్యాషన్ పరిశ్రమ వెబ్‌సైట్స్, సోషల్ మీడియా పేజీలను తరచూ చూస్తుండాలి.
టాప్ ఇన్‌స్టిట్యూట్స్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, న్యూఢిల్లీ
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, అహ్మదాబాద్
సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, పూణే
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, బెంగళూరు
పెరల్ అకాడమీ ఆఫ్ ఫ్యాషన్, న్యూఢిల్లీ
ఆర్చ్ అకాడమీ ఆఫ్ ఫ్యాషన్ ఆర్ట్ డిజైన్, జైపూర్