రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ లో రూ.211 కోట్ల స్కామ్‌కు సంబంధించి.. మాజీ డైరెక్టర్ దేవికా రాణితో పాటు 15 మందిపై ఈడీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. గతంలో నిందితులకు సంబంధించిన రూ.144 కోట్ల ఆస్తులను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. 2019లో తెలంగాణ ఏసీబీ నమోదు చేసిన తొమ్మిది ఎఫ్ఐఆర్ల ఆధారంగా మనీలాండరింగ్ కేసును నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేస్తుంది. తాజాగా నమోదు చేసిన ఛార్జిషీట్లో దేవికారాణి, ఐఎంఎస్ సిబ్బంది, మందులు, కిట్లు సరఫరా చేసే శ్రీహరిబాబు సహా పలువురి పేర్లను చేర్చింది.
మందులు, మెడికల్ కిట్లను సరఫరా చేసే కంపెనీలతో కుమ్మక్కై అధిక రేట్లకు కొనుగోలు చేసి.. బిల్లును సైతం నిందితులు తారుమారు చేసి కోట్ల రూపాయలు కాజేసినట్లు ఈడీ ఆధారాలను సేకరించింది. మెడికల్ క్యాంపులు నిర్వహించి కూడా అవకతవకలకు పాల్పడినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఈఎస్‌ఐ మందుల కొనుగోలు కుంభకోణం కేసులో.. గత ఐదేళ్ల కాలంలో బీమా వైద్య సేవల ద్వారా సుమారు రూ.1000 కోట్లు ఖర్చు పెట్టగా.. వాటిలో రూ.200 కోట్ల వరకు సొమ్మును అధికారులు, సిబ్బంది, ప్రైవేటు వ్యక్తులు కలిసి ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా దోచుకున్నారు. దీనిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దర్యాప్తు చేసింది. ఏసీబీ నుంచి కేసు మనీలాండరింగ్ జరగడంతో ఎన్‌ఫోర్స్‌మెట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది.
ఒక్కొక్కటిగా ఈఎస్‌ఐ స్కాం లింక్‌లను బయటపెడుతూ.. నిందితుల ఆస్తులను జప్తును చేశాయి. ఈ క్రమంలో ఈఎస్‌ఐ ఔషధాల కొనుగోలులో కీలకపాత్ర పోషించిన ఐదుగురు నిందితులకు సంబంధించిన రూ.144 కోట్లను కూడా అటాచ్ చేశారు. ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్ డాక్టర్ దేవికారాణి, మాజీ జేడీ పద్మ, ఫార్మసిస్టు నాగలక్ష్మి, ఓమ్ని గ్రూపు డైరెక్టర్ కె.శ్రీహరిబాబు, పందిరి రాజేశ్వర్‌రెడ్డి ఆస్తులను తాత్కాలిక జప్తు చేసింది.’ఈఎస్‌ఐ డైరెక్టరేట్ కుంభకోణాలకు నిలయం’ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణికి చెందిన రూ.17.26 కోట్ల విలువైన ఆస్తులు.. నాగలక్ష్మికి చెందిన రూ.2.45 కోట్ల ఆస్తులు, పద్మకు చెందిన రూ.74.08 లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేశాయి.
వీరితో పాటు ఓమ్ని గ్రూపు డైరెక్టర్ శ్రీహరిబాబుకు చెందిన రూ.119.89 కోట్ల.. పందిరి రాజేశ్వర్ రెడ్డికి చెందిన రూ.4.07 లక్షల విలువైన ఆస్తులను జప్తు చేశారు. అంతకు ముందు ఐఎంఎస్ కుంభకోణానికి సంబంధించి రాష్ట్ర ఏసీబీ అధికారులు ఎనిమిది కేసులు నమోదు చేసి.. దర్యాప్తు చేశారు. ఈ అధికారులు ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా.. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై సుమారు రూ.211 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు అవినీతి నిరోధక శాఖ అభియోగాలు నమోదు చేసింది. ఇక్కడ వాస్తవ ధర కన్నా నాలుగు లేదీ ఐదింతలు ఎక్కువగా కొనుగోలు చేసి.. అక్రమంగా భారీగా కొనుగోలు చేశారు.